Thursday, January 23, 2025

కార్మికుల ఆరోగ్యంపై సర్కార్ నజర్

- Advertisement -
- Advertisement -

భవన నిర్మాణ రంగ కార్మికులకు మెరుగైన వైద్యం
సిఎం ఆదేశంతో రంగంలోకి కార్మిక శాఖ అధికారులు
అటు సింగరేణి కార్మికులకు రూ. 259 కోట్లు కేటాయింపు

మన తెలంగాణ / హైదరాబాద్ : కరోనా కాలంలో కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కార్మిక శాఖ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశంతో పలు చర్యలు తీసుకుంది. భవన నిర్మాణ రంగ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సిఎం కెసిఆర్ ఆదేశించడంతో అందుకు అనుగుణంగానే ఆ శాఖ ముందుకు వెళుతోంది. ఇందుకోసం లేబర్ కార్డుకు అప్లై చేసుకుని ఆ కార్డు ద్వారా సేవలు పొందాలని కోరింది. అలా లేబర్ కార్డును పొందిన భవన నిర్మాణ రంగానికి చెందిన ప్రతి కార్మికుడికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం కల్పించింది.

కరోనా సమయంలో ఇలాంటి కార్డులేవీ లేక.. వారికి వచ్చిన రోగం ఏదో తెలియక మధ్యలోనే చాలామంది కార్మికులు ఆశువులు బాశారు. ఇప్పుడు అలా కాకుండా తమకు వచ్చిన వ్యాధులు నిర్ధారణ అయితే సంబంధిత ఆసుపత్రులకు సిఫార్సు చేస్తామని తెలంగాణ కార్మికశాఖ ప్రకటించడంతో కార్మికులు ప్రస్తుతం లేబర్ కార్డు కోసం క్యూ కడుతున్నారు. కాగా సుమారు రూ.10 వేల వరకు ఖర్చయ్యే 50 రకాల టెస్ట్‌లను తెలంగాణ ప్రభుత్వం లేబర్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే అందిస్తోంది. శీతాకాలం సమీపిస్తుండడంతో అందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తోంది. తద్వారా భవన నిర్మాణ రంగ సంక్షేమ మండలి నుంచి గుర్తింపు కార్డు తీసుకున్న ప్రతి కార్మికుడు వైద్య పరీక్షలు చేయించుకునేలా చూస్తోంది. ముఖ్యంగా ఈసీజీ, బీపీ, ఊపిరితిత్తులు, కంటిచూపు, చెవి, ముక్కు, గొంతు, రక్తం, మూత్రం, షుగర్ వంటి పరీక్షలను ఉచితంగానే నిర్వహిస్తున్నారు.

ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైతే హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రధానాసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారు. కార్మికులకు సాధారణంగా సంక్రమించే చిన్న సమస్యలైతే స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్న నిర్మాణ రంగ కార్మికులందరి కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడంతో గల్లీ నుండి హైదరాబాద్ దాకా కార్మికులు అప్రమత్తంగా ఉంటుంన్నారు. కాగా లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు బాడీ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని కార్మికశాఖ అధికారులు ప్రత్యేకంగా గ్రామాల్లో క్యాంపెయిన్‌ను చేయిస్తోంది. లేబర్ కార్డు లేని వారు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, 2 ఫొటోలు తీసుకొని గ్రామపంచాయతీ వద్దకు వెళితే రిజిస్టర్ చేయనున్నట్లు అధికారులు చెబుతుండడం గమనార్హం.

సింగరేణి కార్మికుల కోసం రూ. 259 కోట్లు
కాగా బొగ్గు ఉత్పిత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి కార్మికుల ఆరోగ్యంపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులను నాటి పాలకులు అశ్రద్ధ చేసిన క్రమంలో.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత తొమ్మిదేళ్ల కాలంలో సిఎం కెసిఆర్ వైద్య విభాగం అభివృద్ధిపై చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల కోసం ఆసుపత్రుల వార్డులను పూర్తిగా ఆధునీకరింపజేసి ఏసి వార్డులుగా మార్పించారు. కార్మికుల వైద్యం కోసమే సిఎం కెసిఆర్ రూ. 259 కోట్లు సింగరేణి కంపెనీ నుండి కేటాయింపులు చేయించారు. ఇలా దాదాపు 6 కోట్ల 25 లక్షల రూపాయల ఖర్చుతో సంస్థలోని 7 ఏరియా ఆసుపత్రులకు కావాలసిన ఆధునిక వైద్య పరికరాలను కొనుగోలు చేయించారు. అంతే కాకుండా ప్రభుత్వం ఆదేశంతో సుమారు 61 అంబులెన్స్‌లను కూడా సింగరేణి సంస్థ సమకూర్చుకోవడం విశేషం. కాగా కరోనా నాటి క్లిష్ట పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సింగరేణి కార్మికులకు ఆక్సిజన్ కొరత ఏ మాత్రం ఉండరాదన్న లక్షంతో టర్కీ దేశం నుండి 5 ఆక్సిజన్ ప్లాంట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది.

ఎక్కువ శాతం కోవిడ్ రోగులకు సింగరేణి ప్రాంతంలోనే ఆరోగ్యసేవలను అందించినప్పటికీ , క్లిష్టమైన కేసులను హైదరాబాద్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చేర్పించడం కోసం అప్పటికప్పుడు 15 ఆసుపత్రులతో ప్రత్యేక ఒప్పందం కూడా ఇటీవలే చేయించింది. ఇవి కాక వరంగల్, కరీంనగర్‌లో వంద బెడ్లు అలాగే నిమ్స్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉండే వారికి 16 రకాల వస్తువులు ఉండే ఐసోలేషన్ కిట్లను అందజేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News