Wednesday, January 22, 2025

మత్స్యరంగాన్ని మరచిపోయారా!

- Advertisement -
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తితో ప్రథమస్థానంలో నిలిచిన చైనా తర్వాత రెండవ అతిపెద్ద దేశంగా నిలిచే భారతదేశంలో మత్స్యరంగానికి అనుబంధంగా ఆదాయ వనరులతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించగలిగే మత్స్యరంగం లో సర్వతోముఖాభివృద్ధిని సాధించే దిశలో మన ప్రభుత్వాలు ఆచరణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికలను అమలుపరుచడంలో చాలినంత చొరవను ప్రదర్శించడం లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధివిధానాలు, రూపొందిస్తున్న పథకాలు, వాటిని అమలుపరచడంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణులు కూడా ఈ అపవాదులను మరింతగా బలపరుస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యరంగాన్ని కేవలం చేపల ఉత్పత్తికి సంబంధించిన సాంప్రదాయ ప్రక్రియగా మాత్రమే పరిమితం చేయడం, శాస్త్రసాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక విధానాలను అమలుపరచడంలో దేశంలోని మత్స్యకారులను గాని, మత్స్య సహకార సంఘాలను గాని భాగస్వాములను చేయకపోవడం లాంటి అనేకానేక కారణాల ఫలితంగా మత్స్యరంగంలో అందుబాటులోకి వస్తున్న అవకాశాలు గరిష్టస్థాయిలో వినియోగంలోకి రావడం లేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. సముద్రతీరంలేని తెలంగాణ రాష్ట్రం ఉపరితల జలవనరుల (ఇన్ ల్యాండ్) విస్తీర్ణంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నప్పటికీ చేపల ఉత్పత్తి, ఉత్పాదకతలతోపాటుగా చేపల ఆహార వినియోగంలోను, మత్స్యరంగానికి సంబంధించిన అనుబంధ రంగాలను విస్తరించుకోవడంలోనూ జాతీయస్థాయి ప్రమాణాలకు చేరుకోలేకపోతున్నది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటినుండి ఇక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానపరమైన లోపాలే ఇందుకు ప్రధానకారణంగా చెప్పకతప్పదు. మత్స్యరంగానికి అనుబంధంగా చేపపిల్లల (సీడ్)ఉత్పత్తి, చేపల దాణా (ఫీడ్) ఉత్పత్తి, ఫిష్ ప్రాసెసింగ్, వాల్యూ ఆడిషన్ తదితర ఉపాంతరంగాలతోపాటు చేపల వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు (ఫిష్ ఫెర్జిలైజర్స్), క్రిమిసంహార మందులు (ఫిష్ పెస్టిసైడ్స్) లాంటి ఎన్నోఅదనపు ఆదాయ వనరులను సమకూర్చగలిగే అవకాశాలు ఉన్నప్పటికీ తెలంగాణ రా్రష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలో కనీసం ఆలోచించిన దాఖలాలు బూతద్దంతో వెదికినా కనిపించవు. తెలంగాణలో మత్స్యరంగానికి అనుబంధంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రంగంమీద ఆధారపడిన లక్షలాది మత్స్యకార కుటుంబాల ఆదాయవనరులను పెంపొందించేందుకు, వారి జీవనస్థితిగతులలో గణనీయమైన మార్పులను సాధించేందుకు అందుబాటులోఉన్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన ఆచరణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుపరిచే అవకాశాలున్నాయి.

అయితే తెలంగాణ రాష్ట్రమత్స్యశాఖ అధికారుల చిత్తశుద్ధి కరువు, ప్రభుత్వాధినేతల సంకల్పలోపం ఇందుకు ప్రధానమైన అవరోధాలుగా కనిపిస్తున్నాయి.దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అత్యంత బలమైన మత్స్యసహకార సంఘాల వ్యవస్థ వేళ్లూనుకుని ఉన్నది. అయితే వాటిని బలోపేతం చేయడానికి బదులుగా ఇక్కడి మత్స్యసహకార సంఘాల వ్యవస్థను బలహీనపరిచేందుకు గత పాలకులు అనేకరకాలైన పరోక్షపద్ధతులను అమలుపరిచారు. సమీకృత మత్స్యఅభివృద్ధి పథకం (ఐ.ఎఫ్.డి. ఎస్) పేరు మీద, ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం పేరిట మత్స్యకారులను మభ్యపెట్టే ప్రయత్నాలకు ఇచ్చిన ప్రాధాన్యతను, ఆ రంగం మీద ఆధారపడిన లక్షలాది మత్స్యకార కుటుంబాలు చేపల పెంపకం ద్వారా స్వయం సమృద్ధిని సాధించే దిశలో ఎలాంటి ప్రయత్నాలను చేయలేదు. తెలంగాణలో నూతనంగా ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలను చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని పాలనలో కూడా గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఇంతవరకూ ఎలాంటి చొరవను ప్రదర్శించిన దాఖలాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారబాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ మత్స్యరంగానికి సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దడంలో కనీసం పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. పైగా గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రణాళికబద్ధమైన విధానాలు లేకుండా అమలుపరిచిన అరకొర విధానాలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలుపరుస్తున్న యథాతథంగా అనుసరిసున్నట్లు కనిపిస్తున్నది.

తెలంగాణ మత్స్యరంగాన్ని స్వయం సమృద్ధం చేయడం, రాష్ట్రంలోని సాంప్రదాయ మత్స్యకారులకు సంవత్సరం పొడవునా పూర్తికాలంపాటు వృత్తిని కొనసాగించుకోవడం ద్వారా వారి ఆదాయాలను పెంపొందించడం, రాష్ట్రం లో చేపలపెంపకానికి అనువుగాఉన్న నీటి వనరులన్నింటినీ వినియోగంలోకి తీసుకురావడం, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక విధానాలను అమలులోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి, ఉత్పాదకతలలో గణనీయమైన మార్పులు తీసుకురావడం, మత్స్యసహకార సంఘాలను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలోని మత్స్యసహకార వ్యవస్థను పటిష్టం చేయడం, తెలంగాణలో చేపల ఆహార వినియోగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పెంచడం, విదేశాలకు ఇక్కడి చేపల ఎగుమతులను ప్రోత్సహించడంలాంటి అనేకమైన లక్ష్యాలను గత ప్రభుత్వం నిర్దేశించుకున్నది. ఇందుకు అనుగుణంగా కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టినప్పటికీ అప్పటి ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమైన విధానాలు, అత్యున్నతస్థాయి నుండి అట్టడుగు స్థాయివరకు అమలు జరిగిన అవినీతి పద్ధతులు, అధికార యంత్రాంగంలో వేళ్లూనుకున్న లంచగొండితనం, నియంత్రణలో శాఖాపరమైన లోపాలు తదితర వ్యవస్థీకృతమైన కారణాల ఫలితంగా గడచిన పది సంవత్సరాల పాలనాకాలంలో గత ప్రభుత్వం అమలు జరిపిన పథకాలేవీ ఆశించిన ప్రయోజనాలను పూర్తిస్థాయిలో సాధించలేకపోయాయి.

గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అవినీతికి పరాకాష్టగా మారిపోయిందనే అపవాదును మూటగట్టుకోవడం మినహా ఆశించిన రీతిలో ఫలితాలను సాధించలేకపోయింది. దాదాపు ఎనమిది సంవత్సరాలపాటు నిరాటంకంగా అమలుజరిపిన ఈ పథకం తెలంగాణ మత్స్యరంగానికి ఒక నయా ఫిషరీస్ మాఫియా ముఠాను పరిచయం చేసింది. తెలంగాణ రాష్ట్ర మత్స్యరంగంలో మౌలికమైన మార్పులను తీసుకురావాలని, మత్స్య సహకార సంఘాల వ్యవస్థను బలోపేతం చేయాలని, సాంప్రదాయ మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపాలనే ఆదర్శవంతమైన లక్ష్యాలతో అమలుపరిచిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ఆచరణలో నీరుగారిపోయింది. ఈ పథకాన్ని అమలు చేయడం కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్.సి.డి.సి) నుండి సేకరించిన సుమారు వెయ్యికోట్ల రూపాయల రుణభారం మాత్రం ఇంకా తెలంగాణ మత్స్యరంగాన్ని వెంటాడుతున్నది.

గత ప్రభుత్వ పదేళ్ల సుదీర్ఘ పాలనా కాలంలో మత్స్యసహకార సంఘాల వ్యవస్థ పూర్తిస్థాయిలో కకావికలమై ఆనవాళ్లు కోల్పోతున్నది. రాష్ట్రంలోని దాదాపు ఆరు వేల పైచిలుకు మత్స్యసహకార సంఘాలను, వాటిల్లో సభ్యులుగా నమోదైన సుమారు నాలుగు లక్షల మంది మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాలను పట్టించుకుని పర్యవేక్షించవలసిన తెలంగాణ రాష్ట్ర మత్స్యసహకార సంఘాల సమాఖ్య (తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్) పాలక మండలిని నియమించే కర్తవ్యాన్ని బుద్ధిపూర్వకంగా విస్మరించడం మత్స్యరంగంపట్ల పాలకులు అనుసరించే నియంతృత్వ ధోరణులకు నిదర్శనంగా నిలుస్తున్నది. రాష్ట్రంలో మౌలిక రంగాలలో వ్యవసాయం తరువాత అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్న మత్స్యరంగం ద్వారా సాధించవలసిన లక్ష్యాలను, ఇందుకు అనుగుణంగా అనుసరించవలసిన విధివిధానాలను రూపొందించుకునేందుకు ఇప్పటి ప్రభుత్వం కనీస ప్రయత్నాలను కూడా ప్రారంభించిన దాఖలాలు గడచిన ఎనమిది నెలల పాలనా కాలంలో భూతద్దంతో వెదికినా కనిపించడంలేదు.

పైగా గత ప్రభుత్వ పాలనాకాలంలో అమలు జరిపిన లోపభూయిష్టమైన పద్ధతులనే ప్రస్తుత ప్రజాప్రభుత్వం కూడా అనుసరించేందుకు సిద్ధపడినట్లు భావించవలసివస్తున్నది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్దేశాలను అనుసరించి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 33 జిల్లాలన్నింటిలోనూ జిల్లా మత్స్యసహకార సంఘాలను ఏర్పాటు చేసి, రాష్ట్రస్థాయిలో మత్స్యసహకార సంఘాల సమాఖ్యకు సహకార చట్టాల స్ఫూర్తితో ఎన్నికలను నిర్వహించి, పూర్తిస్థాయి పాలకమండలిని ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయకుండా తిరిగి ఈ సంస్థకు నామినేటెడ్ పద్ధతిలో చైర్మెన్‌ను నియమించడం ఈ భావనకు బలం చేకూరుస్తున్నది. అవినీతికి పునరావాసంగా మారిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అమలును యథాతథంగా కొనసాగించేందుకు పూనుకోవడం కూడా తెలంగాణ మత్స్యరంగంపట్ల ఈ ప్రభుత్వం అనుసరించదలుచుకున్న నిర్లక్ష్యపూరితమైన విధానాలకు అద్దంపడుతున్నది.

మత్స్యశాఖ అంతర్భాగంగా కలిగి ఉన్న డైరీ, పశుసంవర్ధక శాఖలను ఇంతవరకూ అధికారికంగా ప్రత్యేక మంత్రిని నియమించకపోవడం కూడా తెలంగాణ మత్స్యరంగం పట్ల పాలకుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా కనిపిస్తున్నది. పర్యవసానంగా మత్స్యశాఖలోని అధికార యంత్రాంగంపైన ప్రభుత్వ అజమాయిషీ నామమాత్రంగా పరిణమించి, అవినీతికూపంలో కూరుకుపోయిన అధికారుల ఇష్టారాజ్యంగా కొనసాగేందుకు పరిస్థితులు దోహదం చేస్తున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. గడచిన ఎనిమిది నెలల పాలనా కాలంలో తెలంగాణ మత్స్యరంగం సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు కనీస ప్రయత్నం చేయకపోవడంతో ఈ రంగం మీద ఆధారపడిన గంగపుత్ర, ముదిరాజ్ లాంటి మత్స్యకార కులాలకు చెందిన ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఎవరికీ కేటాయించని శాఖలన్నీ ముఖ్యమంత్రి నియంత్రణలోనే ఉండటంవల్ల, ఏ మంత్రికీ కేటాయించని పశుసంవర్థక, డైరీ, మత్స్యశాఖ ఈ ప్రభుత్వం ఏర్పాటైననాటి నుండి ముఖ్యమంత్రి నియంత్రణలోనే ఉన్నది.

తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు ఎంతో ప్రాముఖ్యతను, అద్భుతమైన భవిష్యత్తును కలిగిఉన్న తెలంగాణ మత్స్యరంగం ద్వారా భారీ స్థాయిలో మత్స్యసంపదను, తద్వారా వేలా దిమందికి ఉపాధి అవకాశాలను, ముఖ్యంగా ఈ రంగం మీద ఆధారపడిన మహిళల సాధికారికతను సాధించేందుకు, చేపల ఆహారానికి సంబంధించిన ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని సాధించేందుకు అవకాశాలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా తెలంగాణ రాష్ట్ర మత్స్యఅభివృద్ధి సంస్థ (కార్పొరేషన్) ఏర్పాటు చేయ డం ద్వారా తెలంగాణ మత్స్యరంగాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశ లో పరుగులెత్తించేందుకు పూర్తిస్థాయి అవకాశాలు కలుగుతాయి. ఇందుకు అనుగుణంగా ఈ రంగంమీద సంపూర్ణ అవగాహన కలిగిన నిపుణులతో ఒక కమిటీని నియమించి తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ పాలసీని రూపొందించవలసిన తక్షణ ఆవశ్యకతను ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ శాఖను నిర్వహిస్తున్న రాష్ట్రముఖ్యమంత్రివర్యులు గుర్తించగలిగితే మంచిది.

(రచయిత తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు)

పిట్టల రవీందర్
99630 62266

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News