Monday, December 23, 2024

సర్కారు కొత్త తాయిలాలు, మళ్లీ ఓట్లు దండుకునేందుకే

- Advertisement -
- Advertisement -
ధర్నాచౌక్‌లో టి టిడిపి మహాధర్నాలో కాసాని జ్ఞానేశ్వర్ విమర్శ

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజలను మభ్యపెట్టి మళ్లీ ఓట్లు దండుకునేందుకే ఎన్నికలకు 2 నెలల ముందు సర్కారు కొత్త తాయిలాలు ప్రకటిస్తోందని టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆరోపించారు. హామీల అమలుకు ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుండి లేపేందుకే హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నా చేపట్టామని ఆయన అన్నారు. 9 ఏళ్ల బిఆర్‌ఎస్ సర్కారు పాలన ఎద్దు మీద వాన పడ్డట్టుగా ఉందని కాసాని విమర్శించారు. ప్రభుత్వహామీలు వైఫల్యాలు అన్న అంశంపైనే తాము మహాధర్నాను చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ఆపార్టీ అగ్రనేతలు మహా ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాలో పాల్గొన్న పార్టీ శ్రేణులను ఉద్దేశించి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజలకు వాగ్దానం చేసిన హామీలను ప్రభుత్వం ఎప్పుడో మరిచి పోయిందన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఎవరైనా నాయకులపై, కార్యకర్తలపై మీడియాలో అవినీతి వార్తలు వస్తే తక్షణమే స్పందించి విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకునేవారమని, నేడు బీఆర్ ఎస్ పాలనలో అడ్డగోలుగా అవినీతి వ్యవహారాలు జరుగుతున్నా.. అధికారం ఉన్నవారి రాజ్యం నడుస్తోందని విమర్శించారు. బిఆర్‌ఎస్ పాలనలో గడచిన 9 ఏళ్లలో కట్టని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కొత్తగా ఇప్పుడు కట్టిస్తా నని చెప్పడం వింతగా ఉందన్నారు. అక్కడక్కడా కొన్ని చోట్ల కట్టిన ఇళ్లను 9 ఏళ్లుగా పంచకుండా అవి దెబ్బతిన్నాకా ఎన్నికలకు రెండు నెలల ముందు ఇండ్లు పంపిణీ చేయడం ప్రజలను ఓట్ల కోసం మరో సారి మభ్య పెట్టేందుకేనని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న ఆ 5 ఏళ్ళల్లో వాటిని అమలు చేయాలన్నారు. కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం హామీలను ఏవీ పక్కాగా నెరవేర్చలేదని విమర్శించారు. ధరణి పోర్టల్ , భూ సమస్యలపై లక్షల దరఖాస్తులు వచ్చినా ఎంఆర్‌ఓ, ఆర్‌డిఓ, జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయల్లో అవి పరిష్కారానికి నోచుకోవడమే లేదన్నారు. దీంతో రైతులు అరిగోస పడుతున్నారని కాసాని విమర్శించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని లక్షల ఎకరాల పట్టా భూములను కూడా అడ్డగోలుగా ప్రభుత్వ భూములుగా చూపించుకుంటున్నారని కాసాని ఆరోపించారు. ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ భూములను పేదలకు ఇవ్వకుండా అమ్మడానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన విమర్శించారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం .. ఎమ్మెల్యేలకు ఠంఛనుగా జీతాలు ఇవ్వడానికి ఆ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉంటుందని గుర్తు చేస్తున్నామన్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేస్తున్నారని.. కానీ కేటాయింపుల్లో రాష్ట్ర బడ్జెట్ జీరోనే అని కాసాని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ సారి టిడిపికి అండగా నిలబడాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ఈ మహా ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ , జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు , జాతీయ అధికార ప్రతినిధి టి.జ్యోత్స్న , తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నురి నర్సిరెడ్డి, జాతీయ కార్యదర్శి కాసాని విరెష్, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు కాట్రగడ్డ ప్రసూన, సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా, తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పతి సతీష్ సహా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News