మన తెలంగాణ/పంజాగుట్ట: జూబ్లీహిల్స్‌లో హౌజింగ్ సొసైటీ ఆక్రమణలో ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం సర్వే నెం. 403లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి కేటా యించిన స్థలాన్ని ఆనుకొని కొంత ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో ఇటీవల సొసైటీ ఆధ్వర్యంలో గదుల నిర్మాణం చేశారు. కాగా ఈ స్థలం సొసైటీకి చెందింది కాకున్నా దానిలో నిర్మాణాలు చేపట్టారంటూ కొంతమంది జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సొసైటీ లే అవుట్‌ను పరిశీలించగా దానిలో ఈ స్థలం లేకపోవటంతో ఈ స్థలమంతా ప్రభుత్వ స్థలమని, దానిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలంటూ ఈనెల 16న జిహెచ్‌ఎంసి ఈవీ డిఎం డైరెక్టర్ నుంచి షేక్‌పేట మండల తహసీల్దార్‌కు లేఖ వచ్చింది. దీంతో స్థలాన్ని పరిశీలించడంతోపాటు ఆక్రమణలను గుర్తించిన తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డితో ఆదేశాలతో సుమారు రూ. 25 కోట్ల విలువ చేసే స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. స్థలంలో సుమారు 334 గజాలలో ఇటీవల నిర్మించిన గదులను నేలమట్టం చేశారు.