అత్యవసర సేవలకు మినహాయింపు
న్యూఢిల్లీ: ప్రైవేట్ కార్యాలయాలన్నీ మూసివేసి, వర్క్ ఫ్రంహోంకే పరిమితం కావాలని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చింది. తక్షణం ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ ఆదేశాలకు ముందు ఢిల్లీలో 50 శాతం సిబ్బందితో కార్యాలయాల నిర్వహణకు అనుమతి ఉండేది. రోజురోజుకూ ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బార్లు, రెస్టారెంట్లను కూడా మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ(డిడిఎంఎ) ఆదేశించింది. ఆహారం హోం డెలివరీకి, టేక్ అవేకు రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలను 50 శాతం సిబ్బందితో నడిపేందుకు అనుమతిచ్చారు.
ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఢిల్లీలో తాజా పరిస్థితిని సోమవారం డిడిఎంఎ సమీక్షించింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్‌బైజల్ అధ్యక్షతన జరిగిన డిడిఎంఎ సమావేశానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. ఢిల్లీలో పాజిటివిటీ రేట్ 23 శాతం అధిగమించడంతో మరిన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. ఆంక్షల పరిధిలోకిరాని వాటిలో బ్యాంకులు, అత్యవసర సేవలందించే కంపెనీలు, బీమా, మెడిక్లెయిమ్, ఫార్మా కంపెనీలు, న్యాయసేవలు, కొరియర్ సర్వీసులు, సెక్యూరిటీ సేవలు, మీడియా, పెట్రోల్ పంపులు, గ్యాస్, చమురు రిటైల్ దుకాణాలు ఉన్నాయి. వీటిని 100 శాతం సిబ్బందితో నడిపేందుకు అనుమతి ఇచ్చారు.