Monday, December 23, 2024

ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

- Advertisement -
- Advertisement -

Government pays special attention to public health

అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
దోమల నివారణకు నీరు నిల్వ ఉండకుండా చర్యలు
పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర సంస్థలలో
ప్రతి శుక్రవారం ఫ్రై డే… డ్రై డే
సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు
ప్రజల ఆరోగ్యం కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం

హైదరాబాద్ : రాష్ట్రంలో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజలకు ఇబ్బంది రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అత్యవసర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్లను, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టడంతోపాటు, రాష్ట్ర మంత్రులు, సంబంధిత స్థానిక అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదై విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పెరుగుతున్న సీజనల్ వ్యాధులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార భద్రత చర్యలు, కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన తదితర అంశాలపై ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రులు సమీక్షించారు. సీజనల్ వ్యాధుల కేసులు పెరుగుతున్నందున, అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర సంస్థలలో ప్రతి శుక్రవారం ఫ్రై డే… డ్రై డే వంటి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని కలెక్టర్లను కోరారు. అదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల నిడివిగల ప్రత్యేక ప్రచారాన్ని కూడా పునరుద్ధరించాలని, సాధారణ పారిశుద్ధ్యం, డ్రైన్ క్లీనింగ్, దోమల నివారణ చర్యలను ముమ్మరం చేసేందుకు మున్సిపల్ కమిషనర్లు చురుగ్గా పాల్గొనేలా చూడాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ప్రచారం చేపట్టి బూస్టర్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కలెక్టర్‌లు హాస్టళ్లను తనిఖీ చేయాలి
దోమలు, లార్వా నిరోధక చర్యలను వేగవంతం చేయాలని, నీటి ఎద్దడి నివారణ, డ్రైన్ క్లీనింగ్, చెత్త ఎత్తివేయడం, స్థానిక గ్రామ ఆరోగ్య, పారిశుద్ధ్య కమిటీలు, ఆరోగ్య సిబ్బందిని క్రియాశీలం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బోరు బావుల పరిసర ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, కుళాయిలు, బోరు బావుల వద్ద సరైన నిర్వహణ కూడా ఉండేలా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వ వసతి గృహాలలో పరిశుభ్రత, పారిశుధ్యం విషయాల్లో హాస్టల్ వార్డెన్లు బాధ్యత వహించాలని, అలాగే పారిశుద్ధ్య సిబ్బంది విధులను కూడా పర్యవేక్షించాలని అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో ప్రతిరోజు పారిశుధ్యం చేపట్టాలని, బి.సి సంక్షేమ హాస్టళ్లలో సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతపై కలెక్టర్‌లు పాఠశాలలు, హాస్టళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పాఠశాలలు, హాస్టళ్ల పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి ప్రతి సంస్థకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు.

డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు
వర్షాలు,వరదలతో వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ఉండేందుకు, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. వైద్య సేవలు, తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులకు తగిన సూచనలు ఇవ్వడం, జిల్లాలలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టే విషయంతో పాటు, జిల్లాలో మందులకు కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజా ప్రతినిధులు స్థానికంగా ఉండి పర్వవేక్షించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News