మన తెలంగాణ/హైదరాబాద్: వన్యప్రాణుల సంరక్షణలో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని స్పష్టం అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అటవీ, జీవవైవిధ్య నిర్వహణ మెరుగుపరిచే దిశగా నిపుణుల సూచనలను స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ బోర్డు 7వ సమావేశం మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాల అమలుపై సమీక్షించారు. జాతీయ వన్యప్రాణుల సంరక్షణ మండలి సమీక్షకు పంపిన పలు రాష్ట్ర ముఖ్య ప్రాజెక్టులపై వివరాలను మంత్రి సురేఖ అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ, పర్యావరణ పరిరక్షణ అంశాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రధాన అటవీ సంరక్షణాధికారి మాట్లాడుతూ 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ బోర్డు ఏర్పాటు తప్పనిసరిగా జరగాల్సిన అంశమని వివరించారు. పలు నిర్ణయాలను వివరించారు.
రహదారి విస్తరణకు అనుమతి
పోచారం వన్యప్రాణుల అభయారణ్యం నుంచి వెళ్లే మెదక్- యల్లారెడ్డి రహదారి విస్తరణకు అనుమతి మంజూరు చేశారు. అటవీ ప్రాంతాల్లో ఓఎఫ్‌సి లైన్ల ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చ, ములుగులో 11 కేవీ విద్యుత్ సబ్-స్టేషన్ నిర్మాణం, నాగార్జునసాగర్ డివిజన్లో పెద్దగట్టు ఎత్తిపోతల పథకానికి అనుమతి మంజూరు చేశారు. యానిమల్ పాసేజ్ల మార్పుల కోసం 18 ప్రతిపాదనలు, మొబైల్ టవర్ల కోసం 13 ప్రతిపాదనలపై సమావేశంలో సమీక్షించారు. మీ-సేవ ద్వారా యానిమల్-మ్యాన్ కాంఫ్లిక్ట్ బాధితులకు పరిహారం చెల్లించడానికి కార్పస్ నిధి గురించి చర్చించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ల నుంచి 1,088 కుటుంబాల పునరావాసం వివరాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. అలాగే కవ్వాల్ టైగర్ రిజర్‌లో భారీ వాహనాల రాకపోకలపై నిషేధాన్ని తొలగించే అంశాలను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలు, జాతీయ పార్కులు, ఇంకా పట్టణ పార్కుల అభివృద్ధికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. స్థానిక సేంద్రీయ చెట్లను ప్రాధాన్యతగా పెంచి, సహజ అటవీ వ్యవస్థను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశం చివరిలో బోర్డు సభ్యుల సూచనలను మంత్రి కొండా సురేఖ అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ బోర్డు సభ్యులు, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రామ్‌దాస్ నాయక్, ముఖ్య కార్యదర్శి నదీమ్, పిసిసిఎఫ్ దోబ్రియాల్, ఎలు సింగ్, మంత్రి పీఎస్ ఎంఎస్‌ఎస్ సోమరాజు, ఒఎస్‌డి ఎన్.సుమంత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.