Monday, December 23, 2024

విద్యార్థులకు ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తుంది: బుర్రా వెంకటేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలను మార్చడానికి, వారి విద్యాభ్యాసానికి అవసరమైన మౌళిక వసతులు కల్పించటానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అంతర్జాతీయ దృక్పథం, శాస్త్రీయ అధ్యయన పద్దతులపై విస్తృత అవగాహన కల్పించే ఉద్దేశంతో అమెరికాలోని హార్వర్డ్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రొగ్రాం ఫర్ సైంటిఫికల్ ఇన్‌స్పైర్డ్ లీడర్ షిప్ పేరుతో చేపట్టిన కార్యక్రమం ముగింపు సమావేశానికి బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని, లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ప్రణాళికాబద్దంగా కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. హార్వర్డ్ లాంటి అత్యున్నత విద్యాసంస్థల అధ్యాపకులు ఇక్కడికి వచ్చి బోధించటం ద్వారా విద్యార్థులకు విస్తృత అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. ఆతిథ్యం కల్పించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ చొరవను అభినందించారు. హార్వర్డ్, ఓయూ అధ్యాపకులతో కూడిన ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రిని కలిశామని దీనికి సిఎం రేవంత్ రెడ్డి అభినందించారని గుర్తు చేశారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన ప్రసంగిస్తూ విద్యార్థులు బలమైన విజ్ఞాన పునాదిని ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అవగాహనా స్థాయి అద్భుతంగా ఉంటుందని ఇందుకు సంబంధించిన పలు ఉదాహరణలు వివరించారు.

ప్రభుత్వ సహకారంతో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానాన్ని వందమంది విద్యార్థులు పాఠశాలలకు తిరిగి వెళ్లి స్నేహితులు, ఇతర విద్యార్థులతో పంచుకోవాలని సూచించారు. పాఠశాల, ఉన్నత విద్యా శాఖలు ఇలాంటి అద్భుత కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని ఓయూకు ఇవ్వడం పట్ల ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవిందర్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. సమకాలీన ఆధునిక ప్రపంచ పోకడలను ఒడిసిపట్టుకునే విధంగా విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారన్నారు.

వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అనేక అంశాలపై పట్టు సాధించారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్. లింబాద్రి అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం ద్వారా వారి నుంచి ఎన్నో విషయాలను తాము కూడా నేర్చుకున్నామని హార్వర్డ్ నుంచి శిక్షణకు నాయకత్వం వహించిన ప్రోగ్రాం డైరెక్టర్ ప్రొఫెసర్ డొమినిక్ మావో అభిప్రాయపడ్డారు. గతంలో లేని అవకాశాలను ప్రభుత్వం గ్రామీణ పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని, అందరికీ విజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తోందని రిజిస్ట్రార్ ఆచార్య పి.లక్ష్మీనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో జి. మల్లేశం, ప్రొఫెసర్ బి. మంగు, డాక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు, డాక్టర్ సయ్యద్ అజీమ్ ఉన్నీసా, డాక్టర్ కొండా నాగేశ్వర్, మధన్‌మెహన్, మంగారెడ్డి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News