రైతులకు వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి
8వ నెలలోకి చేరిన నిరసనల ప్రక్రియ
11 దఫాల చర్చలైనా ప్రతిష్టంభనే
న్యూఢిల్లీ : ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, రైతులు తమ ఉద్యమాన్ని ఇకనైనా నిలిపివేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ విజ్ఞప్తి చేశారు. శనివారంతో రైతుల ఉద్యమం ఎనిమిదవ నెలలోకి ప్రవేశిస్తుంది. సుదీర్ఘ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వం వ్యవసాయ రంగ బాగుకు మూడు చట్టాలను తీసుకువచ్చింది. వీటిలోని నిబంధనలపై రైతులతో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నామని తోమర్ తెలిపారు. ఇంతవరకూ రైతుసంఘాలు, ప్రభుత్వం మధ్య 11 దఫాల చర్చలు జరిగాయి. చిట్టచివరి చర్చల దశ జనవరి 22న అంతకు ముందటి సంప్రదింపుల మాదిరిగానే ప్రతిష్టంభనతో ఆగిపొయ్యాయి. చలికాలం, ఎండాకాలం తరువాత వర్షకాలాలు కూడా దాటాయి.
అయితే జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ దశలో తలెత్తిన హింసాకాండ, ఎర్రకోట వద్ద పరిణామాలతో చర్చలకు అడ్డుతెర పడింది. కరోనా రెండో దశ లాక్‌డౌన్‌లు , పంజాబ్, హర్యానాలలో పంటకాలాలు అన్నింటిని విస్మరించి రైతులు తమది జీవన్మరణ సమస్యగా భావించుకుని పరిష్కారం కోసం ఉద్యమం సాగిస్తున్నారు. దేశ రాజధాని శివార్లలో రైతులు ప్రత్యేకించి పంజాబ్, హర్యానా, పశ్చిమ యుపిలకు చెందిన వేలాది మంది రైతులు ఇక్కడి దీక్షాశిబిరాలలోనే ఉంటున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు అయితేనే తాము తిరిగి తమ పంటపొలాలకు వెళ్లుతామని తేల్చిచెపుతున్నారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ కొత్త చట్టాల అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. అంతేకాకుండా ఈ జటిల సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు నియుక్త కమిటీ తన నివేదికను కూడా కేంద్రానికి అందించింది.
రైతులు చెప్పేది వినడానికి సిద్ధం : తోమర్
ఈ విధంగా ఇన్నినెలలు రైతులు నిరసనల ఉద్యమం చేపట్టడం వల్ల సమస్య జటిలం అవుతుంది. పరిష్కారానికి చర్చించుకుందాం , ఈ విషయాన్ని తాను పత్రికల ద్వారా రైతులకు తెలియచేస్తున్నానని తోమర్ తెలిపారు. అత్యధిక రైతులు చట్టాలకు అనుకూలంగా ఉన్నారని, కొన్ని అంశాల పట్ల వ్యతిరేకత ఉన్న రైతులు చర్చలకు ముందుకు వస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తోమర్ చెప్పారు. రైతులకు మద్దతు ధరలను పెంచామని, ఈ మేరకు వారి నుంచి అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులకు ఆదాయం రెండింతలు చేయడమే ప్రభుత్వ ఉద్ధేశమని తెలిపారు.