Monday, February 3, 2025

కుంభమేళా తొక్కిసలాటకు ప్రభుత్వం జవాబుదారీ కావాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కుంభమేళా తొక్కిసలాటపై సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపిలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అలక్షంగా వ్యవహరించిందని, సున్నితత్వంలోపించిందని వారు ఆరోపించారు. ప్రభుత్వం జవాబుడారీగా వ్యవహరించాలని వారు కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న డిఎంకె ఎంపి కనిమోళి కుంభమేళా మృతులకు తన సంతాపం తెలియజేశారు. యాత్రికుల భద్రత కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. ‘కుంభమేళా తొక్కిసలాటలో తమ ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల నా విచారాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. తమకు రక్షణ కల్పిస్తారని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నమ్మకంపెట్టుకున్నారు.

కానీ దురదృష్టవశాత్తు ఎవ్వరూ వారిని కాపాడలేదు’ అని ఆమె అన్నారు. సోమవారం లోక్‌సభలో ప్రతిపక్షాలు సుదీర్ఘంగా నిరసనలు వ్యక్తం చేశాయి. ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాటపైన, మృతుల జాబితాపైన అవి చర్చను కోరాయి. పాలన పట్ల ప్రభుత్వ దృక్పథం సమాజంలో చీలికలకు దారి తీసిందని ఆమె ఆరోపించారు. ‘మతం, రాజకీయాలు కలగలసిపోయినప్పుడు నష్టపోయేది అమాయకులే. తొక్కిసలాటలో మరణించినవారి సంఖ్య ఎంత అనేది మాకు కనీసం తెలియదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రాతినిధ్యానికి సంబంధించి విస్తృత ఆందోళనలను కనిమోళి ప్రధానంగా ప్రస్తావిస్తూ, ‘పార్లమెంట్‌లో ముస్లిం సభ్యుల సంఖ్య తగ్గుతోంది, ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనారిటీ వర్గాల నుంచి కొద్ది మంది ప్రభుత్వాధికారులే ఉన్నారు’ అని తెలిపారు.

ఇది ఇలా ఉండగా, రాష్ట్రపతి ప్రసంగం ‘నాగరిక జాతీయవాదాన్ని’ గొప్పగా చూపిందని ఆమె ఆక్షేపించారు. మైనారిటీల పట్ల ప్రభుత్వ విధానాలను కూడా ఆమె దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, పౌర సమాజంపై ‘పెరుగుతున్న’ దాడులను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. బిజెపియేతర రాష్ట్రాల్లో పాలన అంశం గురించి కనిమోళి మాట్లాడుతూ, గందరగోళం సృష్టికి, పరిపాలన అవరోధానికి గవర్నర్లను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఆమె ‘ఒక దేశం ఒక ఎన్నిక’ యోచనను కూడా వ్యతిరేకించారు. రాష్ట్రం నిర్దుష్ట అంశాలను అది అణచివేస్తుందని, అజెండాపై జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని అనుమతిస్తుందని ఆమె వాదించారు.

కుంభమేళా తొక్కిసలాట విషయమై ఉత్తర ప్రదేశ్ వ్యవహరించిన తీరును సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) ఎంపి నరేష్ చంద్ర ఉత్తమ్ పటేల్ కూడా తూర్పారబట్టారు. ‘కుంభమేళా ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైఫల్యానికి అది దారుణ తార్కాణం’ అని ఆయన అన్నారు. అత్యధిక సంఖ్యలో యాత్రికులు వస్తారని అధికారులు ఎందుకు ఊహించలేదని, మృతుల జాబితాను ఇంకా ఎందుకు విడుదల చేయలేదని ఆయన అడిగారు. ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం పాలనను ప్రహసనప్రాయం చేసింది. తొక్కిసలాటలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో అధికార గణాంకాలు ఇంత వరకు లేవు’ అని పటేల్ విమర్శించారు. కుంభమేళా దుర్ఘటనపై ప్రభుత్వం స్పందనను టిఎంసి ఎంపి కకోలి ఘోష్ దస్తిదార్ గర్హించారు.

ఆ ఘటనపై రాష్ట్రపతి క్లుప్తంగా ప్రస్తావించడాన్ని ఆమె విమర్శించారు. ‘కోట్లాది మంది హిందువులు మహా కుంభమేళా కోసం సన్నద్ధం అవుతున్నారు. అనేక మంది నిరుపేదలు మౌని అమావాస్య కోసం డబ్బు దాచుకున్నారు. ఆ దుర్ఘటనపై రాష్ట్రపతి 61 పదాలు మాత్రమే వాడడంశోచనీయం. ఆమె మరణాలను ఖండించడం గాని, మృతుల కుటుంబాలకు సంతాప సందేశాలు పంపడం గాని చేయలేదు’ అని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక విధానాలు, పాలనపై కూడా దస్తిదార్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు నానా ఇక్కట్లు పడుతుండగా కోటీశ్వరులకు రుణాలు మాఫీ చేయడాన్ని ఆమె ఆక్షేపించారు. జాతీయ భద్రత, పౌరుల్లో అశాంతిసమస్యల గురించి ప్రస్తావించిన దస్తిదార్ రాష్ట్రపతి ప్రసంగంలో మణిపూర్ ప్రస్తావన లేకపోవడాన్ని విమర్శించారు. కాగా, కుంభమేళా దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతిపక్షం మూకుమ్మడిగా డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News