హైదరాబాద్ : వరదల వల్ల ఇప్పటికే జరిగిన ప్రాణ, ఆస్థినష్టాలను అంచనా వేసి నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవాలని, వరద బాధితులకు యుద్ద ప్రాతిపదికన సహాయ సహకారాలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. వరద ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని పార్టీ కార్య కర్తలకు, శ్రేణులకు, ప్రజలకు పిలుపు నిచ్చారు.
రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల వేలాది ఎకరాల్లో పత్తి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, తధితర పంటలు వరద నీటిలో మునిగి పోయాయన్నారు. కొన్ని చోట్ల ప్రాణనష్టంతో పాటు, మూగ జీవాలు చనిపోయాయని తెలిపారు. లోతట్టు కాలనీల ఇండ్లలోకి వరదనీరు చేరడంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందోననే భయంతో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేకుల షెడ్లు, గుడిసెలు, పాకల్లో జీవిస్తున్న పేదలు నిరాశ్రయులయ్యారన్నారు. పంట పొలాలు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని తెలిపారు. వరంగల్, భదాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, హైదరాబాదు తధితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని, ఇంకా అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందన్నారు. భారీ వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నదని, వాటిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.