మన తెలంగాణ/హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి పట్ల కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే అని మండిపడ్డారు. హోంగార్డులకు కనీస ఆత్మగౌరవాన్ని కూడా ఇవ్వకుండా వేధిస్తున్న అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డులు తొందరపడొద్దని ఆత్మహత్యలే మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాదని విజ్ఞప్తి చేశారు. పోరాడి సాధించుకుందాం తప్ప ఆత్మహత్యలు చేసుకొవద్దని సూచించారు. హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారి ఆరోగ్యానికి భద్రత ఇవ్వాలని హోంగార్డ్‌లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రాగానే హోంగార్డ్‌ల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
హోంగార్డు రవీందర్ మరణం అత్యంత విషాదకరం: బండి సంజయ్ కుమార్
సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రవీందర్ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యలను బయటపెట్టాలని, వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రవీందర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతోపాటు వారిని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.