Saturday, December 21, 2024

ప్రభుత్వం విద్యారంగం వైపు అడుగులు వేయాలి: ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యారంగం మార్పువైపు అడుగులు పడాలని, అభివృద్ధి సాధనంగా ఉన్న విద్యారంగం నూతన ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత కావాలని మాజీ ఎమ్మెల్సీ, ప్రొపెసర్. కె. నాగేశ్వర్ పేర్కొన్నారు.  టియస్‌యుటిఫ్ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి ఆసంఘం నూతన సంవత్సరం డైరీ, కాలమానిని ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం కెజి టు పిజిపై హామి ఇచ్చి విద్యారంగానికి కేటాయింపులు పెంచకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని అస్తవ్యస్త పరచిన పరిస్థితుల నుండి అందరికీ నాణ్యమైన, గుణాత్మక విద్యనందించే వైపు నూతన ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. అందుకోసం నూతన ప్రభుత్వం తన మేనిఫేస్టోలో పేర్కొన్న విద్యకు 15 శాతం నిధులను కేటాయించాలని, తలసరి ఆదాయం పెరిగిందని చెప్పుకునే ముందు, ఆర్థిక సామాజిక అంతరాలు గమనించాలన్నారు.

అంతరాలు లేని అభివృద్ధి నూతన ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. దేశంలో విద్యారంగంలో విద్యా పనితీరు సూచిక ప్రకారం రాష్ట్రం 31వ స్థానంలో ఉండడం విద్యలో వెనుకబాటు తనాన్ని సూచిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రసంగిస్తూ విద్యాసంస్థల్లో, చదువుల్లో సమానత్వం సాధిస్తేనే సమాజంలో సమానత్వం సాధించటం సాధ్యమవుతుందన్నారు. రకరకాల పేర్లతో చదువులోనే అడ్డుగోడల్లా అంతరాలున్నపుడు అది అందరికీ సమాన విద్యను అందించినట్లు ఎలా అవుతుందన్నారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య ప్రజల అవసరాలు తీర్చేవిధంగా ఉండాలన్నారు. అదే విధంగా ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ టీచర్ల పదోన్నతులలో సంక్షోభాన్ని నివారించాలని, ప్రధానంగా గత 8 ఏళ్లలో పదోన్నతులు రాక టీచర్లు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా, పదోన్నతులు పొందాలంటే టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలని పేర్కొడం తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి లక్ష్మా రెడ్డి, పి. మాణిక్‌రెడ్డి, డా .ఎల్ .అరుణ, కమలకుమారి, సింహాచలం, గాలయ్య, కొండల్‌రావు, కె, రాజారావు, శ్యాం, జగన్నాథ్‌లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News