Saturday, November 16, 2024

బ్యాంకు ఖాతా బ్లాక్‌ చేయబడిందని మెసేజ్‌.. రూ.2.25 లక్షలు పోగొట్టుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు

- Advertisement -
- Advertisement -

జయశంకర్‌ భూపాలపల్లి : సైబర్ నేరస్థుల చేతికి చిక్కి రూ. 2.25లక్షలు పోగొట్టుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి బుధవారం రాత్రి అజ్ఞాత వ్యక్తి నుంచి సెల్‌ఫోన్‌కు మీ బ్యాంకు ఖాతా బ్లాక్‌ చేయబడిందని మెసేజ్‌ వచ్చింది. దీంతో కంగారు పడి మెసేజ్‌ పంపిన నంబర్‌కు ఫోన్‌ చేయగా, మొదట సిఐఎఫ్‌ నంబర్‌ చెబితే సరిపోతుందని నమ్మించాడు. అనంతరం ఆధార్‌, ఏటీఎం కార్డు నంబర్లు కూడా అడగడంతో సదరు ఉపాధ్యాయుడు అవి కూడా చెప్పాడు.

మరికొద్దిసేపటికి ఫోన్‌ చేసి మీ బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌కార్డు నంబర్‌ను లింక్‌ అప్‌డేట్‌ చేశానని, మధ్యమధ్యలో ఓటిపిలు వస్తాయని, చెప్పాలని కోరాడు. అవి చెప్పిన వెంటనే కొద్ది సేపటికే ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా నుంచి మొదట రూ. లక్ష డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో వెంటనే సైబర్‌ నేరగాడికి ఫోన్‌చేయగా మీ డబ్బులు తిరిగి రాత్రి 10 గంటలకు మీ బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతాయని నమ్మించాడు. ఆ తర్వాత మూడుసార్లు వరుసగా రూ.25వేలు, మరోసారి రూ.50వేలు, ఇంకోసారి రూ.50 వేలు డ్రా అయినట్లు ఉపాధ్యాయుడి సెల్‌ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌లు వచ్చాయి. మొత్తం రూ.2.25 లక్షలు సైబర్‌ నేరగాడు కాజేశాడు. తాను మోసపోయినట్లు గమనించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని కుమారుడికి తెలుపగా వెంటనే రాత్రే సైబర్‌ క్రైం విభాగ సైట్‌కు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News