ప్రజాపాలన దరఖాస్తులకూ రేషన్ కార్డులు
ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బిఆర్ఎస్ విజయం
మాజీ మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కుల గణన దరఖాస్తులతోపాటు, ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బిఆర్ఎస్ విజయం అని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎంఎల్ఎ హరీష్రావు పేర్కొన్నారు. ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..? అని ప్రశ్నించారు. పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో పాటు, పత్రికా సమావేశం నిర్వహించి నిలదీస్తే గాని ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదని ఒక ప్రకటనలో విమర్శించారు.
ఆదాయ పెంపు విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండటం వల్ల లక్షల మంది నిరుపేద వర్గాలు రేషన్ కార్డులకు దూరం అవుతాయని మరొక్క సారి గుర్తు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పొందేందుకు వీలుగా కెసిఆర్ ఆదాయ, భూ పరిమితి నిబంధనల్లో మార్పులు చేశారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదాయ పరిమితి గ్రామీణంలో 60 వేలు, పట్టణంలో 75 వేలు ఉంటే, దాన్ని గ్రామీణంలో లక్షా 50 వేలకు, పట్టణంలో 2.50 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. మాగాణి రెండున్నర ఎకరాలు, మెట్ట 5 ఎకరాలుగా ఉన్న పరిమితిని మాగాణి మూడున్నరకు, మెట్ట ఏడున్నర ఎకరాలకు పెంచారని, దీనివల్ల లక్షల మంది నిరుపేదలకు రేషన్ కార్డు పొందే అర్హతను కెసిఆర్ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితితోపాటు భూ పరిమితి పెంచుతూ నిబంధనల్లో మార్పు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తద్వారా ఆశాలు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు.. ఇతర అల్పాదాయ వర్గాలు, పేదలు రేషన్ కార్డులు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేశారు. పల్లెల్లో అయినా పట్టణంలో అయినా కూలీ ఎక్కడైనా నిరుపేదే అని పేర్కొన్నారు. కాబట్టి పల్లెలు పట్టణాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని, 20 రోజుల పనిదినాల నిబంధన తొలగించాలని, భరోసా పథకాన్ని ఉపాధి హామీకి లింకు చేయకుండా అర్హులైన అందరికీ వర్తింప చేయాలని కోరారు. నిరుపేదలకు ఆసరాగా ఉండే రేషన్ కార్డు జారీ ప్రక్రియలో ప్రభుత్వం కోతలు విధించడం సరికాదని హరీష్రావు హితవు పలికారు.