శాంతి, అహింసలే ఆయుధాలుగా సమరం సాగించి దేశ బానిసత్వ శృంఖలాలు పగులగొట్టి, స్వాతంత్య్రం సాధించిపెట్టిన మహాత్మాగాంధీ ఆశయాలే భారత ప్రజల పంచప్రాణాలు. ఆ మహాత్ముని హత్యా సంఘటన చరిత్రలో చెరగని విషాదం. అటువంటి విషాద సంఘటనను పాఠ్యప్రణాళిక నుంచి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం క్షమించరానిది. పైగా గాంధీజీ హత్యకు గురికావడం అందరికీ తెలిసిందేనని, అది మళ్లీమళ్లీ గుర్తు చేయవలసిన అవసరం లేదని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్ వేదికగా ప్రకటించడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ భావజాల ప్రభావం ఉందని తెలుస్తోంది. మహాత్ముడిని బలిగొన్నది ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కలిగిన ఘాట్సే అన్నది అందరికీ తెలిసిందే. యథారాజ తధా ప్రజ అన్నట్టు కేంద్రంలో పాలనలో ఉన్న పెద్దల ఆలోచనల బట్టే ఈ నిర్ణయాలు వెలువడుతుంటాయి. మరో ముఖ్యమైన సంఘటన కేరళలో నెయ్యట్టింకర పట్టణంలో గాంధేయవాది పి. గోపీనాథన్ అయ్యర్ విగ్రహాన్ని బుధవారం సాయంత్రం గాంధీజీ మునిమనుమడు తుషార్ గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన బ్రిటిష్ పాలకులు కన్నా ఆర్‌ఎస్‌ఎస్ మరింత ప్రమాదకారి అని ఆరోపించారు. బిజెపిని మనం ఓడించగలం కానీ ఆర్‌ఎస్‌ఎస్ విషం లాంటిదనీ, దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇప్పటికే ఇది కేరళలో ప్రవేశించిందని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి మద్దతుదారులకు కోపం తెప్పించి ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని నిరసన నినాదాలు చేశారు. తుషార్ గాంధీ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీన్ని బట్టి గాంధీవాదానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఎలా చాపకింద నీరులా విస్తరిస్తోందో స్పష్టమవుతోంది. కమలనాథులకు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర బొత్తిగా లేకపోయినా మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ సారథులైన గాంధీల కుటుంబ పెద్ద, ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను బద్ధ శత్రువులుగానే చూస్తున్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ తమ ప్రియతమ నాయకులని, తమ ఆదర్శ పురుషులని చెప్పుకొంటుంటారు. కానీ గాంధీజీ అహింసా సిద్ధాంతానికి, నిరాయుధ విధానానికి విరుద్ధంగా మతోన్మాదంతో ముస్లిం మైనారిటీలు, దళితులను హింసాత్మకంగా అణిచివేయడానికి పాల్పడుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దారుణ సంఘటనలను దేశాధినేతగా ప్రధాని మోడీ బాహాటంగా ఖండించిన సందర్భాలు కనిపించవు.దీన్నిబట్టి గాంధీజీపై వారికి ఎంత భక్తిశ్రద్ధలున్నాయో తెలుస్తోంది. గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడుగా మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ కీర్తించడం, దాన్ని బిజెపి పెద్దలెవరూ ఖండించకపోవడం వాస్తవదూరం కాదు. 2022లో గాడ్సేను విమర్శిస్తూ ట్వీట్ చేశారన్న ఆరోపణపై గుజరాత్‌లోని వడ్గామ్ నియోజకవర్గ దళిత నేత జిగ్నేశ్ మేవానీని 2022 ఏప్రిల్ 20 రాత్రి అసోం పోలీస్‌లు అకస్మాత్తుగా అరెస్టు చేసి ఎక్కడికో తీసుకెళ్లడం అత్యంత వివాదాస్పదమైంది. పాలకులకు నచ్చని వారిని చట్టం ఏమైనా చేస్తుందనడానికి ఈ సంఘటన ఉదాహరణ. చివరికి న్యాయస్థానాలు కూడా మేవానీకి అండగా నిలవలేకపోయాయి. 2022 లోనే గాంధేయ వాదానికి సమాధి కట్టే మరో ప్రయత్నం జరిగింది. పార్లమెంట్ ఆవరణలో శాంతియుత ధర్నాలు, దీక్షలు చేపట్టరాదంటూ ప్రభుత్వం ఒక బులెటిన్ విడుదల చేసింది. వెంటనే ప్రతిపక్షాలు దీనిపై విరుచుకుపడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రి ఈ బులెటిన్‌ను, దానితోపాటు తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ఆవరణనుంచి గాంధీ విగ్రహాన్ని, రాజ్యాంగంనుంచి 19(1ఎ) అధికరణను తొలగించాలని గట్టిగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపిలకు నిరసనకు అవకాశం నిరాకరించినప్పుడు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి తమ గోడు చెప్పుకొంటూ నిరసన ప్రదర్శనలు చేసుకునే హక్కు సభ్యులకు ఉండేది. దానిని కూడా నిరాకరించడం కంటే గాంధేయానికి సమాధి ఇంకేముందన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సభ అయినా, సమావేశం అయినా, మరే కార్యక్రమం అయినా ప్రజల హక్కులను కాలరాస్తున్నప్పుడు దానిని శాంతియుతంగా ప్రతిఘటించడం సహజం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాటంలో మహాత్మాగాంధీ ఆశ్రయించిన తిరుగులేని అహింసాయుధాలు ధర్నా, దీక్ష, సత్యాగ్రహం యావత్తు ప్రపంచానికే ఆదర్శమయ్యాయి. అలాంటిది దేశ శిఖరాగ్ర ప్రజాస్వామిక సంస్థ పార్లమెంట్ ఆవరణలోనే ధర్నాలు చేయరాదంటే గాంధీ మార్గాన్ని నియంత్రించడమే. వాక్‌స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగంలో 19వ అధికరణం ద్వారా హామీ కల్పించారు. శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశం కావడానికి, సభలు జరుపుకోవడానికి అవసరమైన స్వేచ్ఛను 19వ అధికరణ(బి) ప్రసాదించింది. అసోసియేషన్లు, యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును 19వ అధికరణ (సి) నిబంధన సమకూర్చింది. దేశమంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కును (డి) నిబంధన కల్పించింది. ఇప్పటికే మామూలుగా వినియోగించే విమర్శల పదాల మీద కూడా అన్‌పార్లమెంటరీ అని ముద్రవేసి ప్రతిపక్షాల గళంపై ఉక్కుపాదం మోపిన కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ బయట ప్రశ్నించే వారి గొంతును నిరంకుశ చట్టాల ద్వారా నొక్కివేయడం ఇదివరకే ప్రారంభమైంది. ఈ పరిణామాలన్నీ ప్రస్తుత పాలకులు గాంధేయ వాదానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘మహాత్మా ! మమ్మల్ని క్షమించు’ అని మానవతావాదులు, గాంధేయ వాదులు వేడుకోవడం తప్పమరేమీ లేదు.
బాపూ! ఈ దుర్గతి బాపు!!
- Advertisement -
- Advertisement -
- Advertisement -