Thursday, January 23, 2025

మోడీ 9 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత యూపీఏ హయాంలో అవినీతి తాండవించేది. అందుకు భిన్నంగా అవినీతికి తావులేని రీతిలో పారదర్శకంగా నరేంద్ర మోదీ పాలనను అందిస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పేర్కొన్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని మాదాపూర్ దసపల్లా హోటల్ లో మీడియాతో ఇంటరాక్షన్ సమావేశం నిర్వహించి పుస్తకావిష్కరణ, ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాంబు బ్లాస్టులు, అలజడి లేకుండా శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ అందించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడారు. దాదాపు 50 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించారు. పీఎం అవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు.

ఇందిరా ఆవాస్ యోజన కంటే మెరుగైన పథకం. ఇంటి నిర్మాణం కోసం మూడు విడత సాయం చేసేవాళ్లు. అది కూడా కలెక్టరేట్ కు సర్టిఫికేట్ సమర్పించాలి. టెక్నాలజీని ఉఫయోగించుకుని జియో ట్యాగింగ్ ద్వారా లబ్దిదారుడికి ఇబ్బంది లేకుండా చేశామన్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల 72 లక్షల మందికి టాయిలెట్లను నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఎర్రకోట నుండి ప్రసంగిస్తూ 10 కోట్ల టాయిలెట్లను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అనుకున్న లక్ష్యానికంటే అధికంగా నిర్మించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత కంపు కొడుతున్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి శుభ్రం చేసినట్లు వెల్లడించారు.అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. అందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉంది.

రైల్వే లైన్లను ఆధునీకకరించారు. కరీంనగర్ -వరంగల్ రైల్వే లైన్, మహబూబ్ నగర్ – విశాఖపట్నం రైల్వే లైన్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అత్యధిక పెద్ద పథకం. ఈ పథకం కింద కార్డు కలిగిన వాళ్లు ఆసుపత్రిలో చేరితే రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందించారు. ప్రపంచ దేశాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అధ్యయనం చేస్తున్నారు. కోవిడ్ సందర్భంగా విదేశాల్లో ఉన్న 2.97 కోట్ల మందిని స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే. భారత్ వసుధైక కుటుంబం. జీ-20 దేశాలకు నాయకత్వం వహిస్తోంది. ఆస్ట్రేలియా ప్రధాని మోదీ ది బాస్ అని అభివర్ణిస్తే కోవిడ్ నుండి దేశాన్ని కాపాడినందుకు పపువా న్యూగినియా ప్రధాని ఏకంగా నరేంద్ర మోదీకి పాదాభివందం చేసినట్లు గుర్తు చేశారు.

జన ఔషధి కేంద్రాల ద్వారా 9 వేల 3 వందలకుపైగా రకాల మందులను చౌక ధరకే అందిస్తున్నారు. మార్కెట్లో 100 రూపాయలకు లభించేది జన ఔషధీ కేంద్రాల్లో 15 రూపాయలకే అందిస్తున్నాం. ఇది మెడిసన్ కాదు.. మోడీసన్. ఎరువుల కొరత లేకుండా చేసి రూ. 6338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరించి రైతులకు ఎరువులు పెద్ద ఎత్తున సబ్సిడీపై అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, పార్టీ రా్రష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, కట్టా సుధాకర్, రాష్ట్ర నాయకులు పాపారావు, భరత్, వెంకటరమణ, వీరెళ్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News