Monday, December 23, 2024

పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ప్రభుత్వం కసరత్తు

- Advertisement -
- Advertisement -

అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరిన రాష్ట్ర ఆర్థికశాఖ
నిధుల సేకరణను పెంచుకోవడానికి అధికారుల ప్రణాళికలు
హామీల అమలుకు ఎంత కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం 2024-, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థికశాఖ అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఈనెల 18వ తేదీ వరకు ఆయా శాఖల ద్వారా ప్రతిపాదనలు చేరాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024,-25 సంవత్సరానికి మొత్తం రూ.2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొంది.

దీంతోపాటు ఈ బడ్జెట్‌లో ఎన్నికల హామీల అమలు కోసం ప్రభుత్వం రూ.53,196 కోట్లు ప్రతిపాదించింది. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు, నీటిపారుదల కోసం రూ.28,024 కోట్లను ప్రతిపాదించారు. ఇలా నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నందున జూలై నెలాఖరులోపు పూర్తి స్థాయి బడ్జెట్ కోసం కసరత్తు చేస్తోంది. ఉభయసభలు ఈ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అయితే ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలు, ఇటీవల ముఖ్యమైన ప్రకటనలను దృష్టిలో పెట్టుకోవాలని ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని సిఎం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖలు వివిధ పథకాల పద్దులకు సంబంధించిన క్షుణ్ణంగా సమీక్షించుకొని ప్రతిపాదనలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

రైతు రుణమాఫీకి రూ.33,000 నుంచి రూ.35 వేల కోట్ల వరకు….

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపుగా 6.71 లక్షల కోట్ల అప్పుల భారం ఉండగా వరుసగా ఎఫ్‌ఆర్‌ఎంబి పరిధిలో అవకాశాల మేరకు అప్పుల మీద అప్పులు చేస్తూ బాండ్లు తాకట్టు పెడుతూ పాలన కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆరునెలల్లో ఎఫ్‌ఆర్‌ఎంబి పరిధికి మించి రూ.12,905 కోట్ల అప్పులు చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలతో కలిపి చెల్లింపులకు రేవంత్ ప్రభుత్వం సగటున రోజుకు రూ.290 కోట్ల మేరకు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతోపాటు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు భారీగా పేరుకుపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాటికి తోడు ఆగష్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీకి రూ.33,000 కోట్ల నుంచి రూ.35,000 కోట్ల వరకు అవసరమని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ హామీని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని, నిధుల సేకరణకు ప్రణాళిక రూపొందించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో, ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి రిజర్వ్ బ్యాంకు అంగీకరించాల్సి ఉంటుంది. లేదంటే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే రైతుల పంట బీమాకు ప్రభుత్వం ఏటా 2వేల కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో 1.32కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అవుతుండగా 2019 నుంచి ఫసల్ బీమా అమల్లో లేదు. ఇప్పుడు ప్రభుత్వం పంటల బీమాకు ప్రీమియం భరించాల్సి ఉంది. ఇకపోతే రైతుబంధు ఖరీఫ్ పంటల సాగు ప్రారంభమైనా ఇంకా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి బడ్జెట్‌లో హామీల అమలుకు ఎంత కేటాయిస్తారు? ఆదాయం పెంపుపై ఎలాంటి చర్యలు చేపట్టారన్నది త్వరలోనే తేలనుంది.

మరో 45 రోజుల గడువు మాత్రమే…

ఫిబ్రవరిలో నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌కు అనుమతి తీసుకున్నందున జూలై నెలాఖరులోపు పూర్తి స్థాయి బడ్జెట్‌కు మరో 45 రోజులు మాత్రమే గడువు ఉన్న తరుణంలో పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పన చేసేలా ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో భాగంగా ఆర్థికశాఖ అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలను కోరింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించి ఆయా శాఖల పనితీరు సూచికల ఆధారంగా నిర్ధేశించిన లక్ష్యాల పూర్తి వివరాలను ఇవ్వాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు బడ్జెట్ ప్రతిపాదనల్లో తగిన కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్ అంచనాలకు తగిన హేతుబద్ధత ఉండాలని ఆర్థిక శాఖ తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర అవసరాలను పరిగణనలోకి తీసుకొని వీలైనన్ని ఎక్కువ నిధులు పొందేలా స్పష్టమైన మార్గదర్శకాలకు లోబడి ప్రతిపాదనలు తయారు చేయాలని ప్రభుత్వం తెలిపింది. బడ్జెట్ కసరత్తుపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేవలం పథకాలకు సంబంధించిన వ్యయ ప్రతిపాదనలను మాత్రమే ఇవ్వాలని ఆర్థికశాఖ తెలిపింది. నిర్వహణ వ్యయానికి సంబంధించి గతంలో ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా కేటాయింపులు చేయాలని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News