న్యూఢిల్లీ : ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని విధానాన్ని అనుసరిస్తోందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం రాజ్యసభలో ఉద్ఘాటించారు. దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి నాటికి నిర్మూలించనున్నట్లు కూడా మంత్రి స్పష్టం చేశారు. హోమ్ మంత్రిత్వశాఖ నిర్వహణపై చర్చకు అమిత్ షా సమాధానం ఇస్తూ, ప్రభుత్వం 370 అధికరణం రద్దు ద్వారా రాజ్యాంగ నిర్మాతల కలను సాఫల్యం చేసిందని వెల్లడించారు. ‘370 అధికరణం కాశ్మీర్‌లో వేర్పాటువాదానికి ప్రాతిపదిక. అయితే, ఆ అధికరణాన్ని తాత్కాలికం చేసినందుకు, దానిని రద్దు చేసే విధాన్ని కూడా అధికరణంలో చేర్చినందుకు రాజ్యాంగ రూపశిల్పులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని చెప్పారు.
‘అయితే, వోటు బ్యాంకు రాజకీయాలు, మూర్ఖపు పట్టుదల కారణంగా 370 అధికరణం కొనసాగింది. 2019 ఆగస్టు 5న 370 అధికరణాన్ని రద్దు చేయడమైంది. దేశంలో ఇద్దరు ప్రభుత్వాధినేతలు, రెండు రాజ్యాంగాలు, రెండు పతాకాలు ఉండరాదన్నది మన రాజ్యాంగ రూపశిల్పుల కల’ అని ఆయన తెలిపారు. 370 అధికరణం రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో భారతీయ యువత బంధం దాదాపుగా మాయమైందని హోమ్ శాఖ మంత్రి చెప్పారు. యుపిఎ హయాంలో ఒకప్పుడు పరిపాటిగా ఉన్న ఉగ్రవాదులను ఘనంగా కీర్తించడం ఎన్‌ఎడి పది సంవత్సరాల పాలనలో అంతమైందని తెలిపారు. ‘పది సంవత్సరాల క్రితం ఉగ్రవాదుల అంత్యక్రియల ఊరేగింపులు సాధారణంగా ఉండేవి.
జనం వారిని కీర్తిస్తుండేవారు. కానీ ఇప్పుడు, ఉగ్రవాదులు హతమైనప్పుడు వారిని వెంటనే ఖననం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ సౌకర్యాలు అనుభవించిన వారి బంధువులను ప్రభుత్వ పదవుల్లో నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించి గట్టి సందేశం పంపింది’ అని ఆయన తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం, రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు సమస్యలు భారత్‌కు అతిపెద్ద సమస్యలు ఉన్నాయని అమిత్ షా చెప్పారు. ‘నాలుగు దశాబ్దాల్లో సుమారు 92 వేల మంది పౌరులు హతులయ్యారు. వాటిని అణిచేందుకు సంఘటిత కృషి ఏమీ జరగలేదు. మోడీ ప్రభుత్వం ఆ పని చేసింది’ అని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించడం లేదని హోమ్ శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఉగ్ర సంఘటనల్లో పౌరులు, భద్రత సిబ్బంది మరణాల సంఖ్య బాగా తగ్గిపోయిందని, కాశ్మీర్ లోయలో రాళ్లు రువ్వే ఘటనలు ముగిసాయని కూడా ఆయన తెలిపారు.
‘మోడీ ప్రభుత్వ హయాంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం వల్ల మరణాలు 70 శాతం తగ్గాయి. ఉగ్ర ఘటనలు కూడా బాగా పడిపోయాయి’ అని ఆయన చెప్పారు. ‘పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో అట్టడుగు స్థాయి నుంచి ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని కూడా అమిత్ షా తెలియజేశారు. ‘జమ్మూ కాశ్మీర్‌లో 201924 కాలంలో సుమారు 40 వేల ప్రభుత్వోద్యోగాల కల్పన జరిగింది. 1.51 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పన జరిగింది. నైపుణ్య క్లబ్‌లు పని చేస్తున్నాయి’ అని ఆయన చెప్పారు.
పూర్వపు ప్రభుత్వాలు నక్సలిజానికి వ్యతిరేకంగా చర్య తీసుకోలేదని కూడా ఆయన ఆరోపించారు. ‘2026 మార్చి 21 నాటికి దేశంలో నక్సలిజం అంతం అవుతుంది’ అని హోమ్ శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఈశాన్య ప్రాంతం గురించి అమిత్ షా ప్రస్తావిస్తూ, ఆ ప్రాంతం మొత్తం మీద ప్రశాంతంగా ఉందని. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నూతన అభివృద్ధి శకం ఆవిర్భవించిందని చెప్పారు. ‘2019 నుంచి మేము దాదాపు 19 ఒప్పందాలపై సంతకాలు చేశాం. అదే కాలంలో ఈశాన్య ప్రాంతంలో దాదాపు పది వేల మంది తీవ్రవాదులు లొంగిపోయారు’ అని అమిత్ షా తెలియజేశారు.