- ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి
కొడంగల్: తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కోతలు లేని నాణ్యమై కరెంట్ అందించడమే ప్రభుత్వ లక్షమన్నారు. తెలంగాణ వస్తే అంధకారమన్న నాయకులే నేడు అంధకారంలోకి వెళ్ళిపోయారని గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ పట్టుదలతో వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణనేనని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు.
కేవలం విద్యుత్ వినియోగానికి రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 17 సబ్ స్టేషన్లు ఉండగా అదనంగా మరో 11 సబ్‌స్టేషన్‌లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో 24 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఉండగా నేడు మరో 11 వేల కనెక్షన్‌లు పెరిగినట్లు తెలిపారు. కేంద్రం వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని షరతులు పెట్టిన కెసిఆర్ ఒప్పుకోలేదని, ముందు నుంచి తమ ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి పల్లెలో విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డివో పీడి కృష్ణణ్, ఏడి నవీన్‌కుమార్, గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ, జడ్పిటిసి సభ్యులు అరుణ దేశు, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.