కరకగూడెం : కెసిఆర్ ఆలోచనతో బడుల రూపు రేఖలు మారిపోయాయని ప్రభుత్వ విప్, పినపాక ఎంఎల్‌ఎ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. రకగూడెం మండలంలోని భట్టుపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా సుమారు 27 లక్షల 84 వేల అభివృద్ధి కార్యక్రమాలకు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో అందరికీ విద్యలో భాగంగా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల వారికి నాణ్యమైన ఉచిత విద్యను అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని తెలిపారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రభుత్వ పాఠశాల కళాశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా, స్థానిక సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, ఎంఈఓ వీరస్వామి, నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.