- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల టౌన్: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జూరాల ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న ఆయకుట్టుకు కుడికాలువ ద్వారా సాగు నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతు సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తూ.. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాగు, తాగు నీటి కోసం గొడవలు జరిగేవని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో ప్రస్తుతం రైతులకు, ప్రజలకు సాగు, తాగు నీటి అవసరాలు తీరుస్తున్నామని పేర్కొన్నారు. సాగు నీటి కోసం మిషన్ కాకతీయ, సాగు పెట్టుబడి కోసం రైతుబంధు, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు, సబ్సిడీపై విత్తనాల సరఫరా వంటి పథకాలను అమలు చేస్తూ రైతులను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదుకుంటారని తెలిపారు. నడిగడ్డలో ప్రతి ఎకరాకు సాగునీరందించి, సస్యశ్యామలం చేస్తామన్నారు.
నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా ర్యాలంపాడు, గూడెందొడ్డి పంపు మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్‌లను పూర్తి స్థాయిలో నింపి, కాలువలకు సాగునీరు విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు పద్మావెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, ఎంపీపీ విజయ్‌కుమార్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, రైతుబందు సమితి మండలాధ్యక్షుడు ఈశ్వరయ్య, సర్పంచులు శివారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ప్రాజెక్టు అధికారులు, బీఆర్‌ఎస్‌పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.