ఆసిఫాబాద్ : మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవం పురస్కరించుకోని జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తరువాత గత తొమ్మిది సంవత్సరాల కాలంలో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, తెలంగాణ ఆడబిడ్డల పెండ్లికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా అర్థిక సహాయంతో పాటు పాటు వితంతువులు, ఒంటరి మహిళలకు రూ. 2 వేల 16ల పెన్షన్ అందిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడి కేంద్రాల ద్వారా గర్భిణులకు ఒక పూట భోజనం, 6 సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, సెర్ఫ్, ఐకేపి ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ఆర్థికంగా ఎదిగేందుకు గ్రూపు రుణాలు, స్త్రీనిధి రుణాలు అందించే అర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ప్రభుత్వ అసుపత్రులలో ప్రసవం అయిన మహిళలకు కెసిఅర్‌కిట్, గర్భిణుల ఆరోగ్య దృష్టా న్యూట్రిషన్ కిట్ అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలు ఎదురుకుంటున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.
సఖి కేంద్రాల ద్వారా మహిళలు ఎదురుకుంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కొరకు షీ టీంలు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడం జరిగిందని, చట్టసభలలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు పెంచి వారిని భాగస్వామ్యం చేయడంతో మహిళలు ఎన్నో పదవులు అనుభవిస్తున్నారని తెలిపారు. బాలికల విద్యపై ప్రభుత్వం ఎన్నో విద్యాలయాలు, గురుకులాలను స్థాపించి విద్యాభివృద్ధ్దికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
జిల్లాలో పోషకాహార లోపం నియంత్రించడంలో అంగన్‌వాడి సిబ్బంది, ఆశావర్కర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 890 మహిళ గ్రూపులకు 1 కోటి 50 లక్షల రూపాయల చెక్కును జిల్లా సమాఖ్యకు అందజేశారు. అనంతరం మహిళా అధికారులు, ఉద్యోగులు, షీ టిం సభ్యులను సన్మానించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మహిళ సంక్షేమం, తెలంగాణ చరిత్రపై ఆలపించిన గీతాలు అందరిని అకట్టుకున్నాయి. మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందించి మహిళలు ఆర్థిక స్వావలంబిక సాధించే దిశగా ప్రోత్సహించడం జరుగుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళ సంక్షేమ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలో గల సంతోష్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి సావిత్రి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మణెమ్మ, మండల పరిషత్ అభివృద్ది ఆధికారి శశికళ ఠాకూర్, జడ్పిటిసి నాగేశ్వర్‌రావు, ఎంపిపి మల్లికార్జున్, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం అధ్యక్షుడు అలిబిన్ హైమద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, అంగన్‌వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.