Wednesday, January 22, 2025

బాన్సువాడ ఎంసిహెచ్‌కు జాతీయ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బాన్సువాడ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసిహెచ్) జాతీయ గుర్తింపు దక్కింది. తల్లి పాలను ప్రోత్సహించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బిఎఫ్‌హెచ్‌ఐ) ‘అందించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్’ (గ్రేడ్ -1) లభించింది. భారతదేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ప్రభుత్వ దవాఖానగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎంసిహెచ్ రికార్డ్ సాధించింది. శిశువుల ఆరోగ్యం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) 10 ప్రమాణాలను నిర్దేశించింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మదర్స్ అబ్జల్యూట్ అఫెక్షన్ (మా) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా బ్రెస్ట్ ఫీడింగ్‌ను ప్రోత్సహిస్తున్న దవాఖానలను యూనిసెఫ్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (బిపిఎన్‌ఐ), అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ ఇండియా (ఎహెచ్‌పిఐ) సంయుక్తంగా ఎంపిక చేసి బిఎఫ్‌హెచ్‌ఐ అక్రిడేషన్ ఇస్తున్నాయి.

ఈ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. బిడ్డ పుట్టిన అర గంటలోనే ముర్రుపాలు తాగించడంతో పాటు ఆరు నెలలపాటు తల్లిపాలు మాత్రమే తాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఐదేళ్లలోపు పిల్లల మరణాలను 22 శాతం నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్రెస్ట్ ఫీడింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య సిబ్బంది, ఆశాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్ వర్క్ ఆఫ్ ఇండియా సహకారంతో 35 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. ప్రత్యేకంగా దేశంలోనే మొదటిసారిగా ‘వాలంటరీ లాక్టేషన్ వర్కర్స్‘ను నియమించింది. వీరు దవాఖానల్లో గర్భిణులకు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రసవమైన అరగంటలోనే పిల్లలకు ముర్రుపాలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ఎంసిహెచ్‌లో ముగ్గురు వాలంటీర్లు ఉన్నారు.

రెండు దఫాల పరిశీలన అనంతరం, ఢిల్లీ నుంచి ఇటీవల వచ్చిన ప్రత్యేక బృందం బాన్సువాడ ఎంసిహెచ్ ను సందర్శించారు. అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధారించుకొని.. అక్రిడిటేషన్ మంజూరు చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నాలుగు ఆసుపత్రులకు మాత్రమే ఈ అక్రిడిటేషన్ ఉంది.
వైద్య సిబ్బందికి అభినందనలు : హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి
బాన్సువాడ ఎంసిహెచ్‌కు బిఎఫ్‌హెచ్‌ఐ అక్రిడేషన్ రావడం హర్షనీయం. దవాఖాన వైద్య సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఇది మరొక నిదర్శనం. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రులు జాతీయస్థాయి నాణ్యతా సర్టిఫికెట్లు సాధించాయి. బిడ్డ పుట్టిన అరగంటలో ముర్రు పాలు పట్టించడం, కచ్చితంగా ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే తాగించడం వల్ల శిశు మరణాలు నివారించడంతో పాటు పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News