గవర్నర్లను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేస్తున్న బిజెపి
సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్
మన తెలంగాణ/మోత్కూరు: తెలంగాణ గవర్నర్ తమిళిసై బిజెపి కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ఆరోపించారు. ఈనెల 26, 27 తేదీల్లో మోత్కూరులో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభల ఏర్పాట్లపై బుధవారం సిపిఎం పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రాల హక్కులను హరిస్తుందని విమర్శించారు. తెలంగాణలో బిజెపి ఏజెండాను అమలు చేసేలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని, దాని ఫలితంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా గవర్నర్ వ్యవహరిస్తుండటంతో రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్ కు గ్యాప్ పెరిగిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలన్న లక్షంతో డబుల్ ఇంజన్ పేరుతో ప్రజాస్వామ్యం బద్దంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను బలహీన పర్చేలా, విచ్చిన్నం చేసేలా బిజెపి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇడిలు, ఐటిలతో దాడులకు తెరలేపుతుందని, వాటికి తోడుగా గవర్నర్ వ్యవస్థను వాడుకుంటుందని జహంగీర్ తెలిపారు.
దేశంలో అధ్యక్ష తరహా పాలన కోసం బిజెపి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అందులో భాగంగానే ఇలాంటి కుతంత్రాలకు తెగబడుతుందని, ఇలాంటి చర్యలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో విఘాతం కలిగిస్తున్నాయన్నారు. కేరళలో కూడా సిపిఎం ప్రభుత్వాన్ని బలహీన పర్చేలా అక్కడి గవర్నర్ ప్రభుత్వాన్ని బలహీన పర్చేలా కేంద్రం ఆదేశాలను అమలు చేస్తున్నారని జహంగీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి విశ్వవిద్యాలయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, గవర్నర్ల వ్యవస్థతో ఎలాంటి ఉపయోగం లేదని, గవర్నర్ వ్యవస్థకు సిపిఎం పూర్తిగా వ్యతిరేకమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి, అనేక కూలీ, భూపోరాటాల గడ్డ మోత్కూరులో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభల్లో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని జహంగీర్ కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మెతుకు అంజయ్య, కూరెళ్ల నర్సింహ, కందుకూరి నర్సింహ, మాండ్ర చంద్రయ్య, శ్రీను, గంగయ్య, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.