మనీలా: ఫిలిప్పీన్స్‌లో గుర్తు తెలియని సాయుధులు శనివారం జరిపిన తాజా దాడిలో ఓ ప్రాంతీయ గవర్నర్, మరో ఐదుగురు ఇతరులు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఆరుగురు అనుమానితులు రైఫ్ఫీళ్లు పట్టుకుని పంప్లోనా టౌన్‌లోని గవర్నర్ ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని వారన్నారు. ఈ కాల్పుల్లో నీగ్రోస్ ఓరియంటల్ ప్రావిన్స్ గవర్నర్ రోయెల్ డెగామోతో పాటు మరో ఐదుగురు మరణించారని ఆయన భార్య వివరించారు.
‘గవర్నర్ డెగామో అలాంటి మరణానికి అర్హుడు కాదు. అతను శనివారం తన నియోజకవర్గీయులకు సేవలందిస్తున్నాడు’ అని పాంప్లోనా మేయర్‌గా ఉన్న జానిస్ డెగామో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు. అధ్యక్షుడు ఫెర్డినాండో మార్కోస్ ఈ హత్యను ఖండించారు. తన రాజకీయ మిత్రుడిని హతమార్చారని అభివర్ణించారు. దాడికి పాల్పడినవారిని ఉద్దేశించి, ‘ఇప్పటికైనా మీరు లొంగిపొండి, అదే మీకున్న మార్గం’ అని హెచ్చరించారు. కాగా ఆరుగురు ముష్కరులతో పాటు 10 మంది అనుమానితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. కాగా అంతరంగిక, స్థానిక ప్రభుత్వ కార్యదర్శి బెంజామిన్ అబాలోస్ సాక్షులు పోలీసుల ముందుకొచ్చి సాక్షం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. డెగామో న్యాయం చేయాల్సిందిగా అర్థించారు.