చండీగఢ్ : తన లేఖలపై తగు విధంగా జవాబులు ఇవ్వకపోతే పంజాబ్ ప్రభుత్వం బర్తరఫ్ అవుతుందని, క్రిమినల్ కేసులు కూడా ఉంటాయని రాష్ట్ర గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ హెచ్చరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలనకు తాను కేంద్రానికి సిఫార్సు చేస్తానని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వైఖరి మారాలని శుక్రవారం గవర్నర్ హెచ్చరించారు. పలు విషయాలపై ప్రభుత్వాధినేతకు తాను లేఖలు రాస్తూ వస్తున్నా, స్పందన లేదని, దీనిని సీరియస్‌గా తీసుకోవల్సి ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు.
ఈ ప్రభుత్వం ఉండదు, తరువాత కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని పురోహిత్ ఘాటుగా సిఎం మాన్‌ను హెచ్చరించడం, గవర్నర్‌కు ముఖ్యమంత్రికి మధ్య సాగుతోన్న పంచాయతీని మరింత ముదిరేలా చేసింది. తన లేఖలపై సిఎంతగు విధంగా స్పందించకపోతే ఇక తాను రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఐపిసి 124 సెక్షన్ల మేరకు చర్యలకు తుది నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ స్పష్టం చేశారు.