చెన్నై: తమిళనాడు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై డిఎంకె అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో డిఎంకె ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం పల్లవరంలో జరిగిన ఒక బహిరంగ సభలో స్టాలిన్ ప్రసంగించారు. రాజ్‌భవన్ నుంచి రాష్ట్రాన్ని పాలించాలని భావిస్తున్నారా అంటూ గవర్నర్‌ను ఆయన నిలదీశారు. గత వారం టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో డిఎంకె ప్రభుత్వంపై గవర్నర్ రవి తీవ్ర విమర్శలు గుప్పించారు. డిఎంకెకు చెందిన ద్రవిడియన్ మోడల్‌ను కాలం చెల్లిన సిద్ధాంతంగా ఆయన అభివర్ణించారు. దీనిపై స్టాలిన్ స్పందిస్తూ..శాసనపరమైన అధికారాలను రాజ్యాంగం పార్లమెంట్‌కు, రాష్ట్ర అసెంబ్లీలకు కల్పించిందే తప్ప గవర్నర్‌కు కాదని గుర్తు చేశారు.
Also Read: కేరళ బోటు ప్రమాదం… 22కు చేరిన మృతులు… ఒకే కుటుంబంలో 11 మంది
ద్రవిడ సిద్ధాంతంపై గవర్నర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ద్రవిడ సిద్ధాంతం కారణంగానే సనాతన ధర్మం, వర్ణాశ్రమ ధర్మం, మను నీతి అంతమయ్యాయని స్టాలిన్ అన్నారు. ద్రవిడ సిద్ధాంతతోనే కులం పేరిట జరిగే వర్ణవివక్ష అంతమయ్యిందని ఆయన అన్నారు. ఆర్యుల సిద్ధాంతాన్ని ఓడించగల సత్తా కేవలం ద్రవిడ సిద్ధాంతానికి మాత్రమే ఉందని, అందుకే గవర్నర్ తమ సిద్ధాంతాన్ని చూసి భయపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్ రవి.. మీరు మా సిద్ధాంతాన్ని చూసి భయపడకండి..ద్రవిడ సిద్ధాంతం మనుషుల్ని విడదీయదు కాని కలుపుతుంది. మా సిద్ధాంతం ధ్వంసం చేయదు..కాని సృష్టిస్తుంది. అది నాశనం చేయదు కాని సరిదిద్దుతుంది.
మా సిద్ధాంతం ఎవరినీ కించపరచదు కాని అందరినీ సమానంగా చూస్తుంది. అది ఎవరినీ విస్మరించదు కాని అందరినీ వెంట తీసుకెళుతుంది అంటూ స్టాలిన్ హితవు చెప్పారు. గవర్నర్ ఎందుకు ప్రతిపక్ష పార్టీ నాయకుడి పాత్రను పోషిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అసలు మీ నియామకం ఉద్దేశం ఏమిటని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను భగ్నం చేయడానికే ఇక్కడకు వచ్చారా అంటూ అడిగారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న సామాజిక స్వరూపాన్ని దెబ్బతీసి కల్లోలం సృష్టించడానికే మీరు ఇక్కడకు వచ్చారని ప్రజలు భావిస్తున్నారని ఆయన గవర్నర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తమిళనాడు శాంతిభద్రతల పరిస్థితిపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ బిజెపి పాలిత మణిపూర్‌లో ఇప్పుడు జరుగుతున్న హింసకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తమిళనాడులో అటువంటి సంఘటనలు జరిగాయా అని ఆయన అడిగారు. బిజెపి పాలనలో ఉన్న కర్నాటకలో ఇటీవల జరిగిన హింసాత్మక సంఘటనలను కూడా స్టాలిన్ ప్రస్తావించారు.