మన తెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సిఎస్ శాంతికుమారిపైన అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ పెట్టడంపైన ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. బిల్లులను ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీకోర్టును కోరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హోలీ సెలవుల తరువాత విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజ్‌భవన్ దిల్లీ కంటే దగ్గరగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. సిఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌కు రావడానికి సమయం లేదా అని ప్రశ్నించిన గవర్నర్ ప్రొటోకాల్ లేదు, అధికారికంగా రాలేదన్నారు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సిఎస్ కలవలేదన్న తమిళిసై సౌందరరాజన్ స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.’ తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య కొంత కాలంగా గ్యాప్ కొనసాగుతోంది.
తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో దూరం తగ్గిందని అందరూ భావించారు. గవర్నర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసం కోసం ప్రభుత్వం ఆహ్వానించటం, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం యధాతధంగా చదవడం ద్వారా విభేదాలు సమసిపోయినట్లుగా విశ్లే షణలు వచ్చాయి. అయితే, ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయటం, ఇప్పుడు గవర్నర్ చేసిన ట్వీట్లతో ఈ సమస్య కొత్త టర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టులో ఈ పిటీషన్ పైన ఎలా స్పందిస్తోందనేది ఆసక్తికరంగా మారుతోంది.