తెలంగాణ పారిశ్రామిక
అభివృద్ధికి మరింత ఊతం
ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర
సంస్కృతికి పెద్దపీట
కర్షకులకు, కూలీలకు
భరోసా గణతంత్ర వేడుకల్లో
గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగం
ప్రజా ప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి పెద్దపీట
వేస్తోంది కర్షకులకు రైతు భరోసా అందిస్తోంది
వ్యవసాయం రాష్ట్ర ఆర్థికరంగానికి వెన్నెముక
వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ – పరేడ్ గ్రౌండ్స్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
మనతెలంగాణ/హైదరాబాద్ : సాంస్కృతిక వారసత్వంతో, ప్రజాస్వామ్య ఆచారాలతో తెలంగాణ ముందుకు వెళ్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, తక్షణ అవసరాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. దావోస్ ఒప్పందాలతో రాష్ట్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు. దావోస్ శిఖరాగ్ర సమావేశంలో కుదిరిన ఒప్పందాలు రూ.1,78,950 కోట్ల విలువైన పెట్టుబడులను తీసుకువచ్చాయని వెల్లడించారు. ఐటీ, పునరుత్పాదక ఇంధనం, ఔషధాలు, స్థిరమైన అభివృద్ధికి కేంద్రంగా తెలంగాణ ఖ్యాతిని పటిష్టం చేశాయని తెలిపారు. ఈ ప్రయత్నాలు 49,500 ఉద్యోగాలను సృష్టించి తెలంగాణ పారిశ్రామిక వృద్ధిని ముందుకు తీసుకెళతాయని ఆకాంక్షించారు. 76వ గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సి, సిఎస్ శాంతికుమారి, డిజిపి జితేందర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తూ, డా.బి.ఆర్. అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగం దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రివర్గ సహచరులకు, శాంతిని ప్రేమించే, కష్టపడి పని చేసే తెలంగాణ ప్రజలకు, దేశ పౌరులందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిందని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించిందని, సర్వే ఆధారంగా కొత్త విధానాలను ప్రభుత్వం రూపొందిస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం నాలుగు పథకాలను ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం ప్రజలకు అందిస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం అని గవర్నర్ హామీ ఇచ్చారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకం
తెలంగాణ వృద్ధికి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇప్పటికీ కీలకమైనదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ స్థిరమైన పట్టణ రవాణాను నిర్ధారిస్తుందన్నారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం కనెక్టివిటీ రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకెళతాయని చెప్పారు. వ్యాపారం, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా, రాష్ట్రం పారిశ్రామిక నైపుణ్యంలో అగ్రగామిగా మారడంతో పాటు, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఐటీ, ఫార్మా పరిశ్రమలలో జిసిసిఎస్ కేంద్రంగా మారిందన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన దార్శనికతను కూడా ప్రారంభిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను రూపొందించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన, నమ్మకమైన, సరసమైన విద్యుత్తును అందించడానికి ప్రయత్నిస్తూనే రాష్ట్రానికి ఇంధన భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఇందులో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కూడా ఉందని తెలిపారు. ఇది తెలంగాణను సాంకేతికత, ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. నాల్గవ నగరంలో విశాలమైన 200 ఎకరాల్లో ప్రతిష్టాత్మకమైన ఏఐ నగరాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ గీతం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రజా కవి అందె శ్రీ రాసిన ప్రసిద్ధ గీతం ‘జయ జయహే తెలంగాణ జనని జయ కేతనం’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించబడిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రజా ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని చెప్పారు. అలాగే గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి, డాక్టర్ అందెశ్రీ, గోరేటి వెంకన్న,జయరాజు, సుద్దాల అశోక్‌తేజ, ఎక్కా యాదగిరి రావు, పాశం యాదగిరిలను గౌరవించుకుని, వారికి రూ.కోటి నగదు బహుమతితోపాటు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉందని, ఈ ప్రభుత్వ హయాంలో గత ఏడాది వర్షాకాలంలో రికార్డు స్థాయిలో 1.59 కోట్ల టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి కలిగిన రాష్ట్రంగా ఆవిర్భవించడంలో తెలంగాణ గొప్ప ఘనతను సాధించింది అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని వెల్లడించారు. ఆర్థిక భారాలను తగ్గించడానికి 27 రోజుల్లోనే 2 లక్షల రూపాయల పంట రుణ మాఫీని అమలు చేసిందని స్పష్టం చేశారు. పంట రుణ మాఫీ ప్రయోజనం 25 లక్షల 35 వేల 934 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. రైతు భరోసాతో ఏటా ఎకరానికి రూ.12,000 పెంచిన ఆర్థిక సహాయం రైతులకు పెట్టుబడి పెట్టడానికి భరోసా ఇస్తుందన్నారు.
యువతక ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
తెలంగాణ యువత ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తోందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి శిక్షణను అందించడం సాధ్యమవుతుందన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే వారిని ప్రోత్సహించడానికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ సంవత్సరం బిసిల సంక్షేమం కోసం రూ. 9200 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, తెలంగాణ అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు మొదలైన ఆరు పరివర్తన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
సంక్షేమం, ఆహార భద్రత, గృహనిర్మాణం వంటి బహుళ రంగాలకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. నిరాశ్రయులైన, అర్హత కలిగిన కుటుంబాలు ఇళ్ళు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని పేర్కొన్నారు. 2024 -2025లో రూ.22,500 కోట్ల బడ్జెట్‌తో 4,50,000 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందజేయాలని, రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు.
రాజ్యాంగం ప్రసాదించిన విలువలకు మనం పునరంకితమవుదాం
గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న తరుణంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన వ్యాఖ్యల నుంచి మనం స్ఫూర్తి పొందాలని గవర్నర్ అన్నారు. ‘ఎక్కడైతే మనస్సు భయం లేకుండా ఉంటుందో, తల ఎత్తుకుని ఉండగలమో, ఎక్కడైతే స్వేచ్ఛగా జ్ఞానాన్ని సముపార్జించగలమో, నాలుగు గోడల మధ్య ప్రపంచం ముక్కలుగా విడిపోదో…‘ అన్న స్ఫూర్తిని పొందాలని తెలిపారు. ఠాగూర్ చెప్పిన ఈ వ్యాఖ్యలు… సమైక్య, సమ్మిళిత, ప్రగతిశీలమైన తెలంగాణ రాష్ట్ర దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సంక్షేమం, సమానత్వ విలువలకు మనం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.
సత్యం, అహింస వంటి తత్వంతో మన దేశ స్వాతంత్య్రానికి నైతిక పునాదిని వేసిన మహాత్మగాంధీ ఆదర్శాలను అనుసరిస్తూనే… మన ప్రస్థానానికి మరింత స్ఫూర్తినిస్తోందని తెలిపారు. డా.బి.ఆర్. అంబేద్కర్ వంటి దార్శనికుడు, ఇతర రూపకర్తల ఆధ్వర్యంలో రూపొందిన భారత రాజ్యాంగం…. కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్యాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శిని అని వ్యాఖ్యానించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ చెప్పినట్లు… రాజ్యాంగం కేవలం న్యాయపత్రమే కాదు, అది జీవన వాహకం, ఎల్లప్పుడూ యుగయుగాలకు స్ఫూర్తి వంటిది అని పేర్కొన్నారు. అంబేద్కర్ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను, దేశాన్ని ప్రగతి వైపు, సమ్మిళిత అభివృద్ధి వైపు నడిపించుకుందామన్నారు. ప్రస్తుతం తెలంగాణ తన చరిత్రలో కీలక దశలో ఉందని, 2023 సంవత్సరం డిసెంబరులో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రతి పౌరుడి ఆకాంక్షలను సాకారం చేసే, సమ్మిళిత పాలనను అందించే, పారదర్శక, ప్రజాస్వామిక సూత్రాలు, రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించే ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
గవర్నర్ చేతుల మీదుగా 13 మంది అధికారులకు అవార్డుల ప్రధానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనతో పాటు పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన 13 మంది అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పురస్కారాలను అందజేశారు.
1. విక్రమ్ సింగ్- మాన్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్
2. ముషారఫ్ ఫరూఖీ, టిజిఎస్‌పిడిసిఎల్- చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
3. అనురాగ్ జయంతి, -జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్
4. ఎస్.హరీష్, ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్
5. ఇవి నరసింహారెడ్డి- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
6. అనుదీప్ దురిశెట్టి-, హైదరాబాద్ కలెక్టర్
7. కర్నాటి వరుణ్ రెడ్డి,- టిజిఎన్‌డిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
8. కె.విద్యాసాగర్, -ఒఎస్‌డి చీఫ్ సెక్రటరీ
9. జి. రాజేశ్వర్ రెడ్డి – ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్
10. మామిడి హరికృష్ణ- సంస్కృతి శాఖ డైరెక్టర్
11.ఐ. నరసింగరావు- ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజినీర్
12. కె.మనోహర్‌బాబు- ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
13. వి.సర్వేశ్ కుమార్ – సిఎస్ ఆఫీస్ సీనియర్ కన్సల్టెంట్
ఐ అండ్ పిఆర్ ప్రత్యేక కమిషనర్
ఎస్.హరీశ్‌కు ప్రత్యేక పురస్కారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనతో పాటు పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.హరీష్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పురస్కారం అందజేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేషంగా చేస్తున్న కృషికి గుర్తింపుగా గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పురస్కారం అందజేసి గౌరవించింది. గవర్నర్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించిన ఐ అండ్ పిఆర్ ప్రత్యేక కమిషనర్ ఎస్.హరీష్‌ను సిఎస్ శాంతికుమారి అభినందించారు.