Monday, December 23, 2024

దిగివచ్చిన తమిళ గవర్నరు!

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని గవర్నర్ల తీరు ఎంతకీ ప్రజాస్వామికం కాకపోడంతో సుప్రీం కోర్టు గట్టిగా కొరడా ఝళిపించక తప్ప లేదు. దానితో దిగి వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తన వద్ద మూడేళ్ళుగా పెండింగ్‌లో వున్న పది బిల్లులను ఒకేసారి ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్ ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఎటువంటి అభిప్రాయం వెల్లడించకుండా బిల్లులు వెనక్కి పంపించడం ద్వారా గౌరవ గవర్నర్ తన వల్లమాలిన అసహనాన్ని ప్రదర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజ్‌భవన్లకు తగని రీతిలో వ్యవహరించారు. తమిళనాడు డిఎంకె ప్రభుత్వం వెనువెంటనే గత శనివారం నాడే శాసన సభను ప్రత్యేకంగా సమావేశపరచి ఆ బిల్లులకు తిరిగి ఆమోదం పొందింది. బిల్లులను శాసన సభ యథాతథంగా తిరిగి ఆమోదించి పంపిన తర్వాత వాటిపై తన సమ్మతి ముద్రను వేసి పంపించకుండా తన వద్ద వుంచుకొనే అధికారం గవర్నర్‌కు లేదని రాజ్యాంగం 200 అధికరణ స్పష్టం చేస్తున్నది. దీని ప్రకారం శాసన సభ ఆమోదంతో తమ వద్దకు వచ్చే బిల్లులను గవర్నర్లు సాధ్యమైనంత త్వరగా ఆమోద ముద్ర వేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని సుప్రీం కోర్టు గత ఏప్రిల్‌లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసుకొన్న పిటిషన్‌పై స్పందిస్తూ దృఢంగా అభిప్రాయపడింది.

అసెంబ్లీలో పచ్చజెండా ఊపి పంపిన బిల్లులకు ఆమోద ముద్ర వేయవలసిందిగా గవర్నర్‌కు ఆదేశించాలని ఆ పిటిషన్‌లో సుప్రీం కోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇది జరిగిన తర్వాత కూడా తమిళనాడు గవర్నర్ తన వద్ద గల బిల్లులకు విముక్తి ప్రసాదించలేదు. పది బిల్లులను తిప్పి పంపిన ఆయన మరి కొన్ని బిల్లులను ఇంకా తన వద్ద వుంచుకొన్నారని తెలుస్తున్నది. రాజ్‌భవన్లు, గవర్నర్లు వున్నది కేంద్రం ఏజెంట్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధులుగా పని చేయడానికే కాదు, రాష్ట్రాల్లో పాలన ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేలా తోడ్పడానికే తప్ప తామే ఆటంకాలు కావడానికి కాదు కదా! 200 అధికరణ ప్రకారం గవర్నర్లు బిల్లులను ఆమోదించడమో, తిరస్కరించడం లేదా తిప్పి పంపడమో, ప్రత్యేక నేపథ్యంలో వాటిని రాష్ట్రపతికి నివేదించడమో చేయాలి. పెండింగ్ బిల్లులను ఆమోదించి పంపేలా గవర్నర్లను ఆదేశించాల్సిందని తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

ఈ నెల 6న పంజాబ్ ప్రభుత్వ పిటిషన్‌ను విచారిస్తూ తాము ఆ రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రతినిధులు కాము అనే వాస్తవాన్ని గవర్నర్లు గుర్తించాలని సుప్రీం కోర్టు సూటిగా చెప్పింది. ఎన్నికైన ప్రభుత్వాల శాసన నిర్మాణ కార్యకలాపాల్లో తమకు పరిమిత అధికారాలే వుంటాయన్న విషయాన్ని వారు గ్రహించాలని చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వాలు తమ శాసన సంబంధమైన అధికారాల విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితిని కల్పించ వద్దని కూడా గవర్నర్లకు సుప్రీం కోర్టు బుద్ధి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారథ్యంలోని ముగ్గురు జడ్జీల ధర్మపీఠం తాజాగా సోమవారం నాడు తమిళనాడు కేసులో విచారణ జరుపుతూ గవర్నర్ రవి తీరుపై తీవ్రంగా వ్యాఖ్యానించింది. 2020 నుంచి బిల్లులను ఆయన తన వద్ద వుంచుకోడం ఆందోళనకరమైన విషయమని అభిప్రాయపడింది. పంజాబ్ కేసులో తాము నవంబర్ 10న ఆదేశాలు జారీ చేసిన తర్వాతనే తమిళనాడు గవర్నర్‌లో కదలిక వచ్చిందని అన్నది. తాము నోటీసు ఇచ్చిన తర్వాతనే తమిళనాడు గవర్నర్ దారికి వచ్చారని చెప్పింది.

మూడేళ్ళుగా ఈయన ఏమి చేస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినంత వరకు ఎందుకు క్రియారహితంగా వున్నట్టు అని ప్రశ్నించింది. విచారణను వచ్చే నెల 1కి వాయిదా వేసింది. శాసన సభ ప్రత్యేక సమావేశాన్ని జరిపించి గవర్నర్ పంపిన బిల్లులను తిరిగి ఆమోదింప చేసినట్టు తమిళనాడు ప్రభుత్వం ధర్మాసనానికి తెలియజేసింది. గవర్నర్ తమకు రాజకీయ శత్రువుగా వ్యవహరిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేసి వుంది. పందెపు సొమ్ముతో ఆన్‌లైన్ జూదం ఆడడానికి సంబంధించిన బిల్లును, వైద్య విద్యలో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జాతీయ యోగ్యత పరీక్ష (నీట్) రద్దు బిల్లును ఇంతకు ముందు తమిళనాడు గవర్నర్ తిప్పి పంపగా వాటిని కూడా శాసన సభ పునరామోదంతో ప్రభుత్వం రాజ్‌భవన్‌కు మళ్ళీ పంపింది. ఆ తర్వాత నీట్ బిల్లును గవర్నర్ రవి రాష్ట్రపతికి పంపించారు. ఈ బిల్లు విషయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి పత్రాన్ని కూడా సమర్పించారు.

ఇదంతా చూస్తూ వుంటే దేశ రాజకీయ అధికార దండం చేతిలో వున్న కేంద్రంలోని బిజెపి పాలకులు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టి ఇబ్బందుల పాలు చేయడానికి గవర్నర్లను సాధనాలుగా ఉపయోగించుకొంటున్నారని ఎటువంటి అనుమానానికి ఆస్కారం లేకుండా రుజువవుతున్నది. ఇంత కంటే ప్రజాస్వామ్య విలువల ఖననం, హననం ఇంకేముంటుంది?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News