Thursday, January 23, 2025

రాజకీయ రాజ్‌భవన్‌లు!

- Advertisement -
- Advertisement -

Governors political drama  రాజ్‌భవన్‌లు రాజకీయ భవన్‌లుగా మారడం దేశానికి, ప్రజాస్వామిక రాజ్యాంగానికి పట్టిన అరిష్టం. కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన రోజుల్లో గవర్నర్లను దుర్వినియోగం చేసి రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేసిన సందర్భాలున్నాయి. ఎస్‌ఆర్ బొమ్మైయ్ కర్నాటక ముఖ్యమంత్రిగా వున్నప్పుడు శాసన సభా వేదిక మీద బల ప్రదర్శనకు అప్పటి గవర్నర్ అనుమతి ఇవ్వకపోడంతో రాజ్‌భవన్ వేదికగా బలపరీక్ష జరగకూడదని, అది శాసన సభలోనే జరగాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చరిత్రకెక్కింది. అలా అప్పుడు రాజ్‌భవన్‌లు కేంద్ర పాలకుల కుట్రల అమలు వేదికలుగా మారాయి. ఇప్పుడు గవర్నర్లు తమంతట తామే కేంద్రం అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రలతో నేరుగా లడాయికి దిగుతున్నారు. రాజ్‌భవన్‌ల స్థాయిని మరింత దిగజారుస్తున్నారు.

కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య వారధిగా వుంటూ రాజ్యాంగం తమపై వుంచిన బాధ్యతలను నిర్వర్తిస్తూ రాష్ట్రాల్లోని ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలతో మర్యాద పూర్వకమైన సంబంధాలను కాపాడుకోడం గవర్నర్ల బాధ్యత. కేంద్రం నియమించిన వ్యక్తిగా గవర్నర్ పాలనాపరంగా కేంద్ర పాలకులకు కళ్లూ చెవులూ కావాలే గాని వారి రాజకీయ ప్రయోజనాలను భుజాన వేసుకోడం బొత్తిగా తగదు. తాము ఎన్నికైన గవర్నర్లు కామని, అతి పరిమితమైన అధికారాలు మాత్రమే తమకున్నాయని వారు గుర్తించవలసి వుంది. ప్రస్తుత గవర్నర్లలో అటువంటి దృష్టి బొత్తిగా కరువైంది. తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రాజ్‌భవన్‌లోనే సుదీర్ఘ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌పైన, ఆయన ప్రభుత్వంపైన విషం కక్కారు. ఇది ఇంత వరకు ఏ రాజ్‌భవన్‌లోనూ జరగలేదు. గవర్నర్ ప్రతిపక్ష నేత స్థాయికి దిగిపోడమంటే ఇదే. విజయన్ ప్రభుత్వం సిద్ధం చేసిన రెండు చట్టాల (విశ్వవిద్యాలయాల (సవరణ) చట్టం 2022, కేరళ లోకాయుక్త (సవరణ) చట్టం 2022)పై సంతకం చేయబోనని ఆరిఫ్ ఖాన్ ప్రకటించారు. ఆమోద ముద్ర వేయకుండా చట్టాలను నిరవధికంగా వుంచుకునే అధికారం తనకున్నదని కసితో మాట్లాడారు. వామపక్ష ప్రభుత్వం హింసా సిద్ధాంతాన్ని పాటిస్తున్నదని మితిమించిన ఆరోపణ చేశారు. ఎప్పుడో 2019లో జరిగిన కన్నూర్ విశ్వవిద్యాలయ ఘటనను ప్రస్తావించి తన ప్రాణాలకు ముప్పు వుందని అన్నారు. అప్పుడు కన్నూర్ వర్శిటీలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభలు జరిగాయి.

అత్యంత వివాదాస్పదం అయిన పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ ఖాన్ మాట్లాడారు. అది గవర్నర్ చేయదగిన పని కాదు. ఆయన హద్దు మీరినందుకు విద్యార్థులు నిరసన తెలిపారు. గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జనాంతికంగా జరగవలసిన పరస్పర అభిప్రాయ ప్రకటనను వీధిలోకి తీసుకు రావడం, అందుకు రాజ్‌భవన్‌ను వేదికగా చేసుకోడం ఎంత మాత్రం హర్షించదగినది కాదు. కేరళలో జరిగినట్టుగా మిగతా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో గవర్నర్లు విలేకరుల సమావేశాలు పెట్టకపోయినా అక్కడి ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టే రీతిలో సమాంతర పాలనకు సాహసిస్తున్నారని అనడం అతిశయోక్తి కాదు. పశ్చిమ బెంగాల్ పూర్వ గవర్నర్ (ప్రస్తుత ఉపరాష్ట్రపతి) జగ్దీప్ ధన్‌ఖడ్‌కు, సిఎం మమతా బెనర్జీకి నువ్వా నేనా అనే రీతిలో సాగిన వ్యక్తిగత స్థాయి పోరు తెలిసిందే.

ఆయన అప్పుడు అన్ని మర్యాదలను మట్టి గలిపి కేంద్ర పాలకుల రాజకీయ ఏజెంటుగా వ్యవహరించారు. రాజ్‌భవన్‌ను బిజెపి పార్టీ కార్యాలయం మాదిరిగా మార్చారనే విమర్శను తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా ఎదుర్కొంటున్నారు. గవర్నర్లు రాష్ట్రాల రాజ్యాంగాధిపతులుగా రాష్ట్ర మంత్రివర్గ సిఫారసుల మేరకు మాత్రమే నడుచుకోవలసి వుంది. కేరళ గవర్నర్ మాదిరిగా పలానా చట్టాలపై తాను సంతకం చేయబోనని ప్రకటించడం పూర్తిగా అవాంఛనీయం. అలాగే ప్రతిపక్ష ప్రభుత్వాల పాలనపై పరోక్ష విమర్శలు చేయడమూ గవర్నర్లకు తగదు. మన రాజ్యాంగం కేంద్రానికి అపరిమితమైన అధికారాలు ఇచ్చినప్పటికీ సమాఖ్య వ్యవస్థను గౌరవించి రాష్ట్రాలకు కూడా కొన్ని స్పష్టమైన అధికారాలను ఇచ్చింది. అక్కడ ప్రజలెన్నుకునే ప్రభుత్వాల ఏర్పాటుకు పార్లమెంటు మాదిరిగానే శాసన సభలను నియమించింది. ముఖ్యమంత్రులు శాసన సభలో మెజారిటీని కలిగి వున్నంత వరకు వారి మాటకు విలువ ఇచ్చి నడచుకోవలసిన బాధ్యత గవర్నర్లపై వుంది. దీనిని మరచి వారు కేవలం కేంద్ర పాలకుల జేబులోని బొమ్మలుగా మారడం రాజ్యాంగానికి విద్రోహం తలపెట్టడమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News