Thursday, December 26, 2024

భారీ వర్షాల నేపథ్యంలో…… జిల్లాల రెడ్‌క్రాస్ ప్రతినిధులతో గవర్నర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు బాధితుల సహాయార్థం చేపట్టిన ఉపశమనం, పునరావాస చర్యలపై గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ గురువారం రాజ్ భవన్, సమీక్ష నిర్వహించారు. పర్చువల్ విధానంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సిఎస్) 33 జిల్లా శాఖలు, రాష్ట్ర కార్యాలయం ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా ఆయా జిల్లాలలో గల ప్రస్తుత పరిస్థితులను వారు గవర్నర్‌కు వివరించారు. ప్రతి జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బాధితుల సహాయార్ధం చేపట్టిన ఉపశమన, పునరావాస చర్యలపై గవర్నరు అడిగి తెలుసుకున్నారు.

Also Read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)

ఈ సందర్భంగా, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, అత్యవసర వైద్య అవసరాలు ఉన్నవారు, శారీరకంగా వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, సమగ్ర పద్ధతిలో సహాయ, పునరావాస చర్యలను చేపట్టాలని గవర్నర్ ఆదేశించారు. జిల్లా పరిపాలన, ఎన్‌జిఓలు, ఇతర దాతృత్వ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, వరదప్రాంత బాధితులకు నిత్యావసర వస్తువులు, అత్యవసర వైద్య సహాయం, ప్రథమ చికిత్స, ఆహార పంపిణీ వంటి అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని గవర్నర్ సూచించారు.

ఈ వరద పరిస్థితులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, గవర్నర్ కార్యాలయం నుండి అవసరమైన సహాయాన్ని అందించాలని ఆమె కార్యదర్శిని ఆదేశించారు. రాజ్‌భవన్‌లో గత సంవత్సరం ప్రారంభించిన తరహాలో విరాళాల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సహాయ సామగ్రిని సమీకరించడం ప్రారంభించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర, జిల్లా కార్యాలయాలకు సూచించారు. ఈలాంటి విపత్కర పరిస్థితులలో ఎంతో సమగ్రవంతంగా, సమిష్టిగా పనిచేస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని గవర్నర్ ప్రశంసించారు, యువతను కూడా రెడ్‌క్రాస్ సహాయక చర్యల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News