Friday, January 24, 2025

గెటవుట్ రవి

- Advertisement -
- Advertisement -

గవర్నర్‌పై భగ్గుమన్న తమిళనాడు
చెన్నై అంతటా వెలిసిన పోస్టర్లు
ట్విట్టర్ వేదికగా డిఎంకె, బిజెపి నేతల వార్
ఆజ్యం పోసిన పొంగల్ ఆహ్వాన పత్రిక

చెన్నై: తమిళనాడు అధికారపార్టీ డిఎంకె, గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. అసెంబ్లీలో రాజకున్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. ఈక్రమంలో చెన్నై నగరంలో గెటౌట్ రవి పోస్టర్లు వెల్లువలా వెలిశాయి. సిఎం స్టాలిన్‌తో గవర్నర్ రవికి ఉన్న విభేదాల కారణంగానే పోస్టర్లు వెలిశాయని బిజెపి వర్గా లు ఆరోపిస్తున్నాయి. ఈ వివాదం సద్దుమణగకముందే రాజ్‌భవన్ పొంగల్ ఆహ్వానపత్రికలో తమిళనాడు ప్రభుత్వ ముద్ర లేకపోవ డం వివాదాస్పదంగా మారింది. సోమవారం అసెంబ్లీలో సంప్రదా య ప్రసంగంలో ప్రభుత్వం అందజేసిన తీర్మానాన్ని చదివేందుకు గవర్నర్ రవి తిరస్కరించారు. దీంతో డిఎంకె అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ అసహనం వ్యక్తం చేయడంతో  ట్విట్టర్‌లో రవికి వ్యతిరేకంగా ట్రెండ్ అయింది.

మరోవైపు బిజెపి స్థానిక వర్గాలు గవర్నర్‌కు మద్దతుగా నిలిచాయి. రవికి మద్దతుగా పోస్టర్లు, ట్వీట్‌లతో అధికారపార్టీపై విమర్శల వర్షం కురిపించాయి. సిఎం స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి సోమవారం జరిగిన ఘటనను అసెంబ్లీ చరిత్రలో మునుపెన్నడూ జరగని సంఘటనగా పేర్కొన్నారు. సాధారణంగా మా నేత అసెంబ్లీలో విపక్షాల విమర్శలకు బదులిస్తారు. విపక్షాలు తమ అసమ్మతిని తెలిపేందుకు వాకౌట్ చేస్తాయి. కానీ విపక్షాల పాత్ర ఈసారి గవర్నర్ పోషించారన్నారు. కాగా సినీయర్ బిజెపి నేత ఒకరు అధికారపార్టీ ఎంఎల్‌ఎల కొంతమందిపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. తమిళనాడు బిజెపి కార్యదర్శి అశ్వత్థామన్ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ ఇండియన్ పీనల్‌కోడ్ సెక్షన్ 124ప్రకారం పోలీసులుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

గవర్నర్‌పై దాడి చేయడం, ఉద్దేశ్యపూర్వకంగా విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం, నిర్బంధించడాన్ని ఐపిసి సెక్షన్ 124 విశదీకరిస్తుంది. కొయంబత్తూరులోనూ గవర్నర్‌కు వ్యతిరేకంగా తంతాయ్ పెరియార్ ద్రావిడర్ కజగం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గవర్నర్ దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ప్రతిగా కార్యకర్తలు కూడా ఆందోళన చేపట్టడంతో పోలీసులు ఇరుపార్టీలకు చెందిన ఆందోళనకారులును అదుపులోకి తీసుకున్నారు. 12న రాజ్‌భవన్‌లో నిర్వహించే పొంగల్ ఉత్సవాల ఆహ్వాన పత్రికలో గవర్నర్ తమిళనాడు ప్రభుత్వ ముద్రను తొలగించారు. కేవలం జాతీయ చిహ్నం మాత్రమే ఆహ్వానపత్రికలో ముద్రించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చర్య తమిళనాడు ప్రభుత్వాన్ని అవమానించడమే అని కొంతమంది ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News