బిసిలను కలవడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వదు
సమస్యలపై ఆమె స్పందించాలి ?
కానీ, రాజకీయ కోణంలో పోయి పార్టీలను ఇబ్బంది పెట్టకూడదు
బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్.కృష్ణయ్య
మనతెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ తమిళిసై గవర్నర్‌గానే ఉండాలని రాజకీయ నాయకురాలిగా ఉండకూడదని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్.కృష్ణయ్య ఎద్దేవా చేశారు. ఆమె బిసి వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ బిసిలను కలవడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వదని, ఆమెకు అది ఇష్టం కూడా ఉండదని, అందరిని కలవాల్సి ఉండగా ఆమె మాత్రం కొందరిని మాత్రమే కలుస్తామనడం మంచి పద్ధతి కాదన్నారు.
పార్టీ వాళ్లు చెబితేనే కలుస్తామనడం కరెక్ట్ కాదనీ, సమస్యలపై ఆమె స్పందించాలి తప్ప రాజకీయ కోణంలో పోయి పార్టీలను ఇబ్బంది పెట్టడాన్ని తాము కూడా వ్యతిరేకిస్తామన్నారు. రాజ్యాంగ బద్దంగా ఉన్న హక్కులను ఆమె వాడుకోవాలి తప్ప ఇతర పార్టీల నాయకులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. బిసి సమస్యలపై అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడంతో పాటు సిఎం కెసిఆర్ కూడా బిసి బిల్లు కోసం మద్ధతు ఇచ్చారని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బిసి జనగనన కోసం టిఆర్‌ఎస్ ఎంపిలు పార్లమెంట్ ప్రొటెస్టు చేయడంపై సిఎం కెసిఆర్, టిఆర్‌ఎస్ ఎంపిలకు కృష్ణయ్య కృతజ్ఞతలు తెలపడంతో పాటు ప్రస్తుతం గవర్నర్‌పై ఆయన స్పందించారు.