హైదరాబాద్: మన రాజ్యాంగం ఎంతో మహోన్నతమైందని, మన రాజ్యాంగ నిర్మాతలు ముందుచూపుతోనే వ్యవహరించారని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌కు సిఎం రేవంత్ రెడ్డి, సిఎస్, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పోలీసులు సైనికుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ ప్రసంగించారు. అన్ని వర్గాల ఆశలు, ఆశయాల సాధనకు రాజ్యాంగం తోడ్పడిందని పేర్కొన్నారు. మన దేశం… భిన్న జాతులు, మతాలు, కులాల సమూహారం అని గవర్నర్ తెలిపారు. అందరినీ ఐక్యం చేసి ఒకే జాతిగా నిలబెట్టిన ఘనత రాజ్యాంగానిదేనని, రాజ్యాంగం మార్గదర్శకత్వంలో ముందుకెళ్లడం గర్వించదగ్గ విషయమని స్పష్టం చేశారు.
రాజ్యాంగ నిర్మాతలకు, దేశ ప్రజలకు ఈ ఘనత దక్కుతుందని, రాజ్యాంగా స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని, పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి ఇచ్చిందని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణను ప్రజలు సాధించుకున్నారని గవర్నర్ తెలిపారు. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గడిచిన పదేళ్లలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. నియంతృత్వ ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదని, ఎన్నికల్లో తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడారని తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని గవర్నర్ తెలిపారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని విస్పష్టమైన తీర్పు ఇచ్చారని, విధ్యంసానికి గురైన వ్యవస్థలను పునర్ నిర్మాణం చేసుకుంటామని వివరణ ఇచ్చారు.