వ్యక్తిగత పొదుపు మొత్తంతో మహిళ ఉద్యోగులకు చీరలు అందజేసిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్
మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రకృతి తల్లికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల శ్రేయస్సుకు దోహదం చేస్తుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదివారం రాజ్‌భవన్ మహిళ ఉద్యోగులకు చీరలను పంపిణీ చేశారు. రెండేళ్లుగా బతుకమ్మ వేడుకల సందర్భంగా గవర్నర్ వ్యక్తిగత పొదుపు మొత్తంతో మహిళ ఉద్యోగులందరికి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రకృతి అందించే పూలను వినియోగించి బతుకమ్మను తీర్చిదిద్ది.. వాటి నిమజ్జనంతో నీటి వనరులను శుద్ధి చేసే ఈ పండుగ ప్రకృతి తల్లిపై భక్తిని పెంపొందిస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు, మహిళల శ్రేయస్సుకు దోహదం చేస్తుందన్నారు. గవర్నర్‌గా తమిళసై సౌందరరాజన్ బాధ్యతలు తీసుకున్నాక.. వివిధ రంగాలకు చెందిన మహిళలు రాజ్‌భవన్‌లో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ మహిళాద్యోగులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.