న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్ పదవితోపాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారని, ఇఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించారని రాజ్‌భవన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్‌గా 62 సంవత్సరాల తమిళిసై ఉన్నారు. ఆమె బిజెపిలో మళ్లీ చేరి ఆ పార్టీ తరఫున తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
గతంలో ఆమె తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అయితే మాజీ గవర్నర్లు ఎన్నికల్లో పోటీ చేయవచ్చా అన్న ప్రశ్న చాలామందిలో వ్యక్తమవుతోంది.రాజ్యాంగం ప్రకారం మాజీ గవర్నర్లు ఎన్నికల్లో పోటీ చేయరాదన్న నిబంధన ఏదీ లేనప్పటికీ 2014లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వరకు గవర్నర్ కార్యాలయాన్ని అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుల క్రియాశీల రాజకీయాల ముగింపునకు సూచనగా పరిగణించేవారు. గవర్నర్లుగా బాధ్యతలు నిర్వర్తించి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి పదవులు చేపట్టిన రాజకీయ నాయకులు బహు అరుదుగా కనిపించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పువచ్చింది. రాష్ట్ర రాజకీయాలలో కూడా గవర్నర్ల జోక్యం పెరుగుతోందని బిజెపియేతర ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
కొందరు మాజీ గవర్నర్లు సైతం ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా..అరుణాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ జెజె సిగ్ పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌పైన పోటీ చేశారు. పదవీ విరమణ అనంతరం జెజె సింగ్ 2008 జనవరిలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్ పదవీకాలం పూర్తయిన అనంతరం శిరోమణి అకాలీ దళ్‌లో చేరి 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పాటియాలా అర్బన్ నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో శిరోమణి అకాలీ దళ్(తక్షలి)లో చేరి ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖర్ కూడా ఇదే కోవకు చెందుతారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేసి మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ చేతిలో ఓడిపోయారు.
మళ్లీ 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో నెమామ్ నుంచి పోటీ చేసి మరోసారి పరజయాన్ని చవిచూశారు. బిజెపియేత పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ల ద్వారా బిజెపి రాజకీయాలు చేస్తోందంటూ ప్రతిపక్షాలు తరచు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు, కేరళలోని ప్రభుత్వాలైతే ఆయా రాష్ట్రాల గవర్నర్లపై సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కాయి. తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్ రవి తొక్కిపెట్టారన్న ఆరోపణలు కూడా అధికార పార్టీ నుంచి వచ్చాయి. తెలంగాణ, పంజాబ్ ప్రభుత్వాలు కూడా గతంలో గవర్నర్లపై ఇవే ఆరోపణలు చేశాయి. పాలనలో గవర్నర్ల జోక్యాన్ని, కల్పిస్తున్న అవరోధాలను సుప్రీంకోర్టులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సవాలు చేశాయి.