హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. శుక్రవారం రాజ్ భవన్ లో ”మూవింగ్ ఫార్వర్డ్ విత్ మెమొరీస్ ఆఫ్ మెయిడెన్ ఇయర్” అనే పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై విడుదల చేశారు. గవర్నర్ గా తన అనుభవాలకు తమిళిసై అక్షరరూపం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… తెలంగాణలో మహిళా సాధికారత సాకారమవుతోందని తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ మహిళలే కావడం హర్షణీయం అన్నారు. కోవిడ్-19 తొలి టీకా తెలంగాణ నుంచే వస్తుందని ఆమె చెప్పానని గుర్తుచేశారు. దేశంలో ఉన్న రెండు టీకాల్లో ఒకటి హైదరాబాద్ కు చెందినదేనని గవర్నర్ స్పష్టం చేశారు.
తాను గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రంగా ఉందన్నారు. తొలిసారి తాను రాసిన లేఖపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆమె పేర్కొన్నారు. విద్య సంబంధిత అంశాలపై కూడా ప్రభుత్వానికి లేఖ రాశానని వెల్లడించారు. విద్య అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది. సిఎం కెసిఆర్ ను కలిసినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలని చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. గవర్నర్, సిఎం ఆఫీసులు ప్రజల కోసమే పనిచేయాలని తమిళిసై చెప్పారు. ప్రభుత్వానికి తనకు కాంట్రవర్రసీలు ఉంటాయని అనుకున్నారు. మంచి కమ్యూనికేషన్ ఉంటే కాంట్రవర్సీకి ఛాన్సే లేదని ఆమె వ్యాఖ్యనించారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిపై కామెంట్ చేయనన్న తమిళిసై గవర్నర్ గా తాను రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు.