Wednesday, January 22, 2025

అవమానించినా వెనక్కి తగ్గను

- Advertisement -
- Advertisement -

Telangana Minister slams Governor Tamilisai

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనను ఎంతగా అవమానించినా ప్రజా సేవ మాత్రం ఆపనని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు గౌరవం ఇచ్చినా…. ఇవ్వకపోయినా ఏ మాత్రం పట్టించుకోనని అన్నారు. విధుల నిర్వహణలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయనని వ్యాఖ్యానించారు. నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతానన్నారు. మరింత రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తానని, తన జీవితం ప్రజల కోసమేనని ఆమె తెలిపారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో గురువారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మూడేళ్ల కాలంలో ప్రజలతో మమేకమైన ఘట్టాలను, చేపట్టిన కార్యక్రమాలు, కోవిడ్ సమయంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలపై రూపొందించిన పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అనంతరం తమిళిసై మాట్లాడుతూ, మూడేళ్ల కాలంలో రాజ్ భవన్‌ను ప్రజాభవన్‌గా మారడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేసే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అయితే తనది ఎవరికి భయపడే స్వభావం కాదన్నారు. ఒక గవర్నర్‌గా ఇవ్వాల్సిన ప్రోటోకాల్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదన్నారు. ఇది అనేక సందర్భాల్లో బయట పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తనతో వచ్చిన ఇబ్బంది ఎంటో అర్ధం కావడం లేదన్నారు. మహిళా గవర్నర్‌గా పురుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేయగలనని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెలికాప్టర్ అడిగితే ఇవ్వలేదన్నారు. కనీసం చివరి నిమిషం వరకు కనీస సమాచారాన్ని కూడా అందించ లేదని వ్యాఖ్యానించారు. దీంతో అయినా దాదాపు ఆరు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మను సందర్శించుకున్నానని తమిళిసై తెలిపారు. ప్రజల దగ్గరికి వెళ్లాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఇబ్బంది ఎదురైందని ఆరోపించారు. కొన్ని విషయాలను బయటకు చెప్పుకోలేనని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

అలా అయితే వెంటనే కెసిఆర్ ఫోటో పెట్టిస్తా
కాగా రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి ఫొటోలు పెట్టడం అనవాయితీ అని అన్నారు. అయితే తన ఫోటో లేని కారణంగానే సిఎం రావడం లేదంటే….. వెంటనే కెసిఆర్ ఫోటో పెట్టిస్తానని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తమిళిసై చెప్పారు. అలాగే రిపబ్లిక్ వేడుకలకూ తనను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించలేదన్నారు. ఇక శాసనసభలోనూ గవర్నర్ ప్రసంగాన్ని పక్కన పెట్టారన్నారు. సమస్యలు ఏమైనా చర్చించి పరిష్కరించుకోవాన్నారు.

పూర్తి సంతృప్తి నచ్చింది
తన మూడేళ్ల గవర్నర్ పదవి కాలం పూర్తి సంతృప్తి నిచ్చిందని తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా వివక్షకు గురైనప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు మాత్రం దగ్గర కాగలిగానని తెలిపారు. అందుకే ప్రజల కోసం…వారి సమస్యల పరిష్కారం ఎంతదూరంమైనా పోతానని అన్నారు.
ఇందులో గవర్నర్‌గా తన పరిధిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించనని అన్నారు. అయితే ఒక సిటిజన్‌గా ప్రజల కోసం ఎప్పుడు పరితపిస్తూనే ఉంటానని అన్నారు. వారి అభివృద్ధి కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. కొవిడ్ సమయంలో ప్రజలను ఆదుకున్నామన్నారు. ఆదివాసీల కోసం 6 గ్రామాలను దత్తత తీసుకున్నామన్నారు. గిరిజనుల ఆర్థిక పరిపుష్టి కోసం కోడి పిల్లలను పంపిణీ చేశామన్నారు. రక్తహీనత తగ్గించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల అవస్థలు, సమస్యలను గుర్తించి సిఎం కెసిఆర్‌కు పలు లేఖలు రాశానని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెడ్‌క్రాస్ సోసైటీ ద్వారా సాధ్యమైనంత మేర సేవ చేశామన్నారు. అలాగే పేద విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లను అందజేశామన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఉందని తమిళిసై అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచాలని సూచిస్తున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె అన్నారు. సిఎం నుంచి మొదలుకుని సామాన్య పౌరుడు కూడా వైద్యకోసం ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలన్నారు. అప్పుడే ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. అలాగే విద్య కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనేక యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దీని వల్ల విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించ లేమన్నారు. దీనిని ప్రభుత్వం భారంగా పరిగణించకుండా భవిష్యత్ తరాలకు పెట్టుబడిగా భావించాలన్నారు.

రాజకీయ ఉద్దేశాలు లేవు
తాను చేపట్టిన కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ, వ్యక్తిగత ఉద్దేశాలు లేవని తమిళిసై అన్నారు. ప్రజలకు సేవ చేయకుండా తనను ఎవరు ఆపలేరన్నారు. అయితే వ్యక్తులు, కార్యాలయాలను అవమానించడం సరికాదన్నారు.బాసరలో విద్యార్థుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించిందన్నారు. అలాగే తెలుగు వర్సిటీలోనూ అనేక సమస్యలు గుర్తించి ప్రభుత్వానికి చేరవేశామన్నారు. ఇలా అనేక అంశాలపై స్పందించాలని ప్రభుత్వానికి పలు లేఖలు రాశానని…అయితే వారి నుంచి సరైన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సెప్టెంబర్ 17వ తేదీనీ రాష్ట్ర ప్రభుత్వం సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తోందని….కానీ తనకు తెలిసినంత వరకు లిబరేషన్‌డే గానే నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను కేంద్రం నెరవేర్చడం లేదు…ఈ విషయంలో గవర్నర్‌గా మీ పాత్ర ఏంటని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా…. ఇటీవలే దక్షిణాది రాష్ట్రాల జోనల్ సమావేశాన్ని కేంద్రం నిర్వహించిందని తమిళిసై గుర్తు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు సంబంధిత ఉన్నతాధికారులంతా హాజరయ్యారన్నారు. పలువురు ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారన్నారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కాలేదన్నారు. కెసిఆర్ పాల్గొని ఉంటే అనేక అంశాలకు పరిష్కారం లభించి ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. రాజకీయాలు వేరు…కేంద్ర, రాష్ట్ర సంబంధాల వేరు అని అన్నారు. బిజెపితో కెసిఆర్‌కు ఎలాంటి ఇబ్బందులున్నప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మాత్రం కేంద్రంతో సంప్రదింపుల విషయంలో ఎలాంటి బేషజాలు ఉండకూడదన్నారు.

Governor Tamilisai slams KCR Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News