Thursday, September 19, 2024

ఎంఎల్ఎ పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్‌రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై స్పందించారు. గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కూకట్ పల్లి జెఎన్‌టియు ఆడిటోరియంలో జరిగిన 14వ జాతీయ ఓటర్ల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి ప్రచారంలో సభలో అన్నారని ఎన్నికల కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఓటర్లను ఎవరు బెదిరించకూడదని, ఇబ్బంది పెట్టకుండా ఎన్నికల అధికారులు చూడాలన్నారు. నోటాకు తాను పూర్తి వ్యతిరేకమని, ఎన్నికల బరిలో ఉన్నవారిని ఎవరినో ఒకరి ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. ఓటు వేయడం ప్రజల హక్కు , రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మధ్య వారధిగా ఉంటడం నా బాధ్యత, సాధారణ ఎన్నికలను విజయవంతం జరిపినందుకు ఇసిని అభినందించారు. మొదటిసారి ఇంటి నుంచి ఓటు వేయడం అనేది మంచి పరిణామం, ఓటింగ్ రోజు సెలవు అనేది సరదా కోసం కాదని యువత గుర్తు చేసుకోవాలన్నారు.

ఓటు హక్కు వినియోగం అనేది యుద్దంలో పాల్గొన్నట్లు అనుకోవాల-న్నారు. ఓటు వేసిన మార్క్ గర్వంగా భావించాలని పేర్కొన్నారు. ఓటు శాతం పెరగడానికి ప్రకటన ఒకటే ఉపయోగపడవనే విషయం ఇసి ఆలోచించాలని సూచించారు. ఓటు అనేది ప్రజల చేతుల్లో ఆయుధమని దానిని తప్పకుండా వినియోగించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును మొదటిసారి వినియోగించుకున్న యువత ఎంతో ఆనందంగా ఓటు వేశారన్నారు. రాష్ట్ర ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా విజయవంతం అయ్యాయని, రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ఆనందకరమన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ ఉందని ఓటు వినియోగించు కోకపోవడం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇతర దేశాలకు వెళ్లే సందర్భంలో మాత్రం విమానాశ్రయంలో గంటల తరబడి క్యూ లైన్ లో ఉంటారని అన్నారు. నగరంలోని ఐటీ కంపెనీలకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఓటు హక్కు ఉన్న వారిని వినియోగించుకునేలా సెలవులు ఇచ్చేలా సౌకర్యాలు కల్పించిందని గుర్తు చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో ఓటు ప్రాధాన్యతను తెలిపారు. ఓటు అంటే బుల్లెట్ అని అనుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు హక్కు అనేది ఒక బాధ్యత గా భావించి యువత తప్పకుండా తమ ఓటు వేయాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ వారు పోలింగ్ బూత్ లో తగిన మరిన్ని వసతులు కల్పించాలన్నారు. మంచివారిని ఎన్నుకుంటే సుపరిపాలన అందించగలరని తెలుపుతూ భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రసంగిస్తూ 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రంలో ఇటీవల విజయవంతం చేసినందుకు ఎన్నికల అధికారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా బుల్లెట్ కంటే ఎక్కువ. ఓటు అని అబ్రహం లింకన్ మాటలు గుర్తు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువత ఓటు వేయాలని, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు శాతం గ్రామీణ ప్రాంతాల్లో పెరగగా హైదరాబాద్ వంటి పట్టణాల్లో తగ్గిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు మరింత కృషి చేయాలన్నారు. ఈ విషయంలో ముఖ్యంగా యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

అదే విధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన వికాస్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా కొత్తగా ఓటర్ల నమోదుకు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. 2023 లో కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారు 9.99,667 ఓటర్లు నమోదైనట్లు వివరించారు. 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు 7.50 లక్షల మంది ఓటర్లుగా నమోదు అయ్యారని . ఫిబ్రవరి 8వ తేదీ వరకు తుది ఓటరు జాబితా విడుదల సందర్భంగా మరింత పెరుగే అవకాశం ఉందని అర్హులైన వారంతా ఆన్‌లైన్,బిఎల్‌ఓల ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ఉన్నవారు ఓటరు జాబితాలో పేరును కూడా పరిశీలన చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా జరిగాయని, 80 సంవత్సరాలు నిండినవారు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కూడా కల్పించినట్లు తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించుకొని ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అంతకు ముందుగా పోలీసులు గౌరవ వందనం చేయగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి, సీఈవో వికాస్ రాజ్, అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్, జిల్లా కలెక్టర్ గౌతమ్ తదితరులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అయా జిల్లా కలెక్టర్లు అధికారులు, ఆయా పోటీల్లో రాష్ట్రస్థాయిలో విజేతలైన పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అధికారులు అందచేశారు. కొత్తగా ఓటర్లు గా నమోదైన వారికి ఎపిక్ కార్డులను అందించారు.ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ గీతాలాపన చేసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్ రోస్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి , జోనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, అభిలాష అభినవ్, వెంకటేష్ దొత్రే రవి కిరణ్, పంకజ, తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ నుంచి రాజీవ్‌కుమార్ సందేశం ః
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీ నుండి సందేశాన్ని ఇచ్చారు. దేశంలో 8 రాష్ట్రాల్లో నవంబర్ లో జరిగిన రాష్ట్ర ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు 16 దేశాల్లో ఎన్నికలు జరిగి నూతన ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. మన దేశ ప్రజాస్వామ్యం గొప్పదని అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. మొదటి సారి ఓటర్లు నూతన పోలింగ్ స్టేషన్‌లు మహిళ ఓటర్లు తదితర ఎన్నికల ఏర్పాట్ల టెక్నాలజీ అమలుపై కూడా ఆయన వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News