Friday, November 22, 2024

సిఎస్ వర్సెస్ గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సిఎస్ శాంతికుమారిపైన అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ పెట్టడంపైన ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. బిల్లులను ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీకోర్టును కోరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను హోలీ సెలవుల తరువాత విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇదే సమయంలో పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజ్‌భవన్ దిల్లీ కంటే దగ్గరగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే సిఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌కు రావడానికి సమయం లేదా అని ప్రశ్నించిన గవర్నర్ ప్రొటోకాల్ లేదు, అధికారికంగా రాలేదన్నారు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సిఎస్ కలవలేదన్న తమిళిసై సౌందరరాజన్ స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.’ తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య కొంత కాలంగా గ్యాప్ కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో దూరం తగ్గిందని అందరూ భావించారు. గవర్నర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసం కోసం ప్రభుత్వం ఆహ్వానించటం, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం యధాతధంగా చదవడం ద్వారా విభేదాలు సమసిపోయినట్లుగా విశ్లే షణలు వచ్చాయి.

అయితే, ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయటం, ఇప్పుడు గవర్నర్ చేసిన ట్వీట్లతో ఈ సమస్య కొత్త టర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టులో ఈ పిటీషన్ పైన ఎలా స్పందిస్తోందనేది ఆసక్తికరంగా మారుతోంది.
అసలు విషయమేమంటే…!
2022 సెప్టెంబర్‌లో జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టి ఉభయసభల ఆమోదం అనంతరం రాజ్‌భవన్‌కు పంపింది. వాటిల్లో జిఎస్‌టి సవరణ బిల్లుకు మాత్రమే ఆమోదముద్ర వేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మిగతా ఏడు బిల్లులను అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంచారు. దాదాపు 6 నెలలుగా 7 బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లోనే ఉండగా గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మరో 3 బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపింది. వీటికీ ఆమోద ముద్ర పడకపోవడంతో గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

శాసన సభ, శాసన మండలి ఆమోదించుకున్న బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపేలా ఆదేశించాలంటూ ప్రభుత్వం తరఫున సిఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. బిల్లులను రాజ్‌భవన్‌కు పంపి దాదాపు 6 నెలలు కావస్తుండటంతో విధి లేకే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రభుత్వం పిటిషన్‌లో తెలిపింది.
గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటున్న 10 బిల్లులు ఇవే..
1. అజమాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు – 2012
2. పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు
3. పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్ట సవరణ బిల్లు
4. అటవీ యూనివర్సిటీ బిల్లు
5. యూనివర్సిటీల్లో ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
6. మోటర్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు
7. ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు
8. వ్యవసాయ వర్సిటీ చట్ట సవరణ బిల్లు
9. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు
10. మున్సిపల్ చట్టసవరణ బిల్లు
శాసన సభలో ఆమోదం పొందిన ఈ 10 బిల్లులపై తెలంగాణ గవర్నర్ ఎలాంటి నిర్ణయం చెప్పడం లేదని.. దీని వల్ల ఏర్పడిన రాజ్యాంగ ప్రతి ష్టంభన దృష్ట్యా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 163 ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సహాయం, సలహాలోతో మాత్రమే గవర్నర్ విధులు నిర్వహించాల్సి ఉంటుందని గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరిం చడానికి వీలు లేదంది.

షంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందంది. ఆయా బిల్లులపై ఎప్పటి కప్పుడు మంత్రులు నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి తగిన వివరణలు కూడా ఇచ్చారని త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ హామీ కూడా ఇచ్చారని పేర్కొంది. కానీ.. ఇంకా బిల్లులని పెండింగ్ లోనే ఉంచారని వాటిని ఆమోదించేలా ఉత్తర్వులు జారీ చేయాలని సర్వోన్నత న్యాయ స్థానాన్ని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News