Wednesday, January 22, 2025

నేను తమిళ ఆడబిడ్డనైనా.. తెలంగాణ ప్రజలకు అక్కను…

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్…
భద్రాచలంలో గిరిజనులతో గవర్నర్ ముఖాముఖీ…
గిరిజన మహిళలతో కలిసి నృత్యం, భోజనం…
కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

భద్రాచలం: నేను తమిళ ఆడబిడ్డనైనా.. తెలంగాణ ప్రజలకు అక్కనని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ అన్నారు. బుధవారం పర్యటనలో భాగంగా భద్రాచలం వచ్చిన ఆమెకు ఉదయం ఐటిసి గెస్ట్‌హౌస్ వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐటిడిఎ పివో పోట్రు గౌతమ్, ట్రైబల్ వెల్‌ఫేర్ డిడి రమాదేవి, జిల్లా ఇంటర్‌మీడియట్ అధికారిణి సులోచనారాణి, మార్కెటింగ్ ఏడీ అలీమ్, మైనార్టీ వెల్‌ఫేర్ ఆఫీసర్ సంజీవరావు, బూర్గంపాడు తహశీల్ధార్ భగవాన్‌రెడ్డి, ఆర్‌ఐ అక్బర్‌లు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పోలీసులు గవర్నర్ కు గౌరవ వందనం సమర్పించారు.

ఉదయం తొమ్మిది గంటలకు భద్రాచలం రామాలయంలో గవర్నర్ ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం కూనవరం రోడ్డులోని వీరభద్ర ఫంక్షన్‌హాల్‌లో ఆదివాసీ గిరిజనులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ .. అందరూ బాగున్నారా..? అని తెలుగులో పలకరించారు. ప్రజలందరూ బాగుండాలని ఆ సీతారామచంద్రస్వామిని ప్రార్ధించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమె గిరిజనుల ఆరోగ్యం, తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. గిరిజన మహిళలతో కలిసి ఆమె నృత్యం చేశారు. అనంతరం వారితో మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య,పలువురు ఆదివాసీ నాయకులు ఈ ప్రాంత సమస్యల గురించి గవర్నర్‌కు వివరించారు. విభజనలో ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణ కలపాలని గవర్నర్‌ను కోరారు.

భద్రాచలం చూట్టు ప్రక్కల ప్రాంతమంతా ఆంధ్రాలో కలపడం వల్ల భద్రాచలం వాసులకు చెత్తవేసుకోవడానికి కూడా కనీసం డంపింగ్‌యార్డ్ లేదని చెప్పారు. గోదావరి వరదల వల్ల ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని, గిరిజన ఉద్యోగ డ్రైవ్ నిర్వహించాలని, జీవో నెం 3ని ఎత్తివేయాలని గవర్నర్‌కు విన్నవించారు. గవర్నర్ సానుకూలంగా స్పందిస్తూ.. ఇక్కడి ఆదివాసీ ప్రజల సమస్యలు, ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజల సమస్యలు విన్నానని.. చాలా బాధపడుతున్నానని చెప్పారు.

ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఇక్కడి సమస్యలను అర్ధం చేసుకున్నానని, ఆదివాసీలు సమస్య పరిష్కార బాధ్యతలు అప్పగించారని, వీలైనంత త్వరలో పరిష్కరించడానికి కృషి చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఈ ముఖాముఖీ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐటిడిఎ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు ఉన్నారు. అనంతరం రెడ్‌క్రాస్ డిస్ట్రిక్ మీట్‌లో గవర్నర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News