మన తెలంగాణ/మహబూబ్ నగర్: విద్యార్ధులను తరగతి గది నుండి ప్రపంచం వైపు తీసుకువెళ్లడంపై తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా బండమీదిపల్లి లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పాలమూరు విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆరుగురికి పిహెచ్‌డి, అలాగే 73 మందికి గోల్డ్ మెడల్స్ సాధించిన వారికి పట్టాలను, గోల్డ్ మెడల్స్‌ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ చదువులో గోల్డ్ సాధించడం భవిష్యత్తు అభివృద్దికి పునాటి వంటిదన్నారు. ఒక సబ్జెక్టులో గోల్డ్ మెడల్‌ను పొందేందుకు ఆ విద్యార్ధి శ్రమను, సమయాన్ని, సంతోషాన్ని త్యాగం చేస్తే గోల్డ్ మెడల్ వస్తుందని, గతంలో ఇలాంటివి సాధించిన వారిని మునులు అనేవారని, ఇప్పుడు విద్యార్ధులని అంటున్నారని ఆమె తెలిపారు.
ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుందని, చురుకైన విద్యార్ధులతో పాటు, వెనకబెంచి విద్యార్ధులపై కూడా అధ్యాపకులు, ఉపాధ్యాయులు దృష్టి సారించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడైతే వెనకబెంచి విద్యార్ధులు కూడా ముందుకు వస్తారో అప్పుడు నిజంగా ఆ ఉపాధ్యాయునికి, తరగతికి సార్థకత వస్తుందని తెలిపారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల కన్నా గురువులదే ఎక్కువ పాత్ర ఉంటుందని, వారికి ఓపిక కూడా ఎక్కువన్నారు. ప్రస్తుతం మారుతున్న విద్యా విధానం వల్ల పరీక్షలు, తరగతి గదులు, చదువు పట్ల విద్యార్ధులందరికి ఒకే గాటిన కట్టేయలేమని, ముఖ్యంగా భారతదేశ విద్యార్ధుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందన్నారు.
రోట వైరస్ వ్యాక్సిన్ 1998లో ప్రపంచంలో అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇండియాకి 2014న వచ్చిందని, అదేవిధంగా 1974లో పోలియో వ్యాక్సిన్ వస్తే 2014లో భారతదేశం నుండి పోలియోను పూర్తిగా నిర్మూలించుకోగలిగామని, దీనికి వ్యాక్సిన్ ప్రవేశపెట్టడం మనలాంటి అతిపెద్ద జనాభా ఉన్న దేశానికి చేరటానికి అంత సమయం పట్టిందని తెలిపారు. అయితే ఇటీవల వచ్చిన కరోనా వైరస్‌కు మనమే వ్యాక్సిన్ కనుక్కోవడమే కాకుండా, వెనువెంటనే ప్రపంచంలోని 150 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేసే స్థితికి చేరుకోగలిగామని, అలాంటి ప్రతిభావంతులు, శాస్త్రవేత్తలు, విద్యార్ధులు ఎంతో మంది మన దేశంలో ఉన్నారని ఆమె తెలిపారు. జీవితం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, దానిని మనం కచ్చితంగా ఎదుర్కొని తీరాలని, ఆ విధంగా విద్యార్ధులు ఉన్నతమైన లక్షాలతో ముందుకు వెళ్లాలని ఆమె అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో హరితహారం కింద మొక్కల పెంపకాన్ని చేపట్టడం, న్యాక్ రెండవ దశ గుర్తింపుకు వెళ్లడం పట్ల ఆమె అభినందనలు తెలిపారు.