జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి : గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: యువతకు రోల్ మోడల్.. జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహరావు అని గవర్నర్ తమిళిసై కొనియాడారు. గురువారం పివి 17వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పివి ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు పివీ అని అన్నారు. 9 జాతీయ, 8 ఇతర దేశాల భాషలు మాట్లాడగల వ్యక్తి అని గుర్తు చేశారు. జాతిపితగా పివిని పిలుస్తారు.. ఆర్థిక సంస్కరణలు చేసిన వ్యక్తి పివి అని అన్నారు. పిల్లలంతా పివిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మీరంతా కూడా ఎక్కువ భాషలు నేర్చుకోవాలని, అందుకు తగిన విధంగా ప్రాక్టీస్ చేయాలని తెలిపారు. పివి మార్గంలో మనమంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు.
పివి గొప్ప రాజనీతిజ్ఞుడని రాష్ట్ర పశుసంవర్థక, మత్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతించారు. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలతో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సమర్థవంతమైన పాలనతో ప్రపంచ దేశాలలో భారత దేశ ఖ్యాతిని చాటిన మహోన్నత వ్యక్తి పివి అని అన్నారు. అన్ని భాషల్లో మాట్లాడగల వ్యక్తి.. ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తి అన్నారు. పివి శత జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిం దన్నారు. ఢిల్లీలో కనీసం పివి ఘాట్ లేదు.. తెలుగు వారు అంటే కేంద్రంలో గౌరవం లేదన్నారు. పివి భారీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి గౌరవించిందన్నారు. ఎన్నో పుస్తకాలు పివి మీద వచ్చాయని, పుస్తక ప్రియులు అవి చదువుకోవాలన్నారు. పివి కుమార్తె, ఎంఎల్‌సి వాణీదేవి మాట్లాడుతూ ప్రమాదం అంచున వున్న భారత దేశాన్ని తన ఆలోచనతో ఆర్థికంగా పివి గట్టెక్కించారన్నారు.
తన విజ్ఞతతో దేశంలో ఎన్నో సంస్కరణలను చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పివి శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపిందని, ఆయన విగ్రహం నెలకొల్పిందని, దేశంలో ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదని అన్నారు. నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పివి అని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేసిన వ్యక్తి అన్నారు. ఒబి సిలకు ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి అని కొనియాడారు. బిసి కమిషన్, మైనారిటీ కమిషన్లు ఏర్పాటు చేసిన మహ నీయుడు అన్నారు. మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎంఎల్‌ఎ ముఠాగోపాల్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుతో పాటు పలువురు పివి ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు.