వరంగల్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు వరంగల్ వెళ్లిన గవర్నర్, భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత హనుమకొండ జవహర్ నగర్ లో వరద ప్రాంతాన్ని గవర్నర్ తమిళిసై పరిశీలించారు. ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో బాధితులను గవర్నర్ పరామర్శించారు. బాధితులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో హెల్త్ కిట్స్, నిత్యావసరాలు పంపిణీ చేశారు.
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. “భారీ వరదలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపట్టాలి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం అవసరం. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వరదల తర్వాత మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు.