ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారంటూ శివసేన ఆరోపణ
ముంబయి: మహారాష్ట్రతోసహా బిజెపియేతర పాలిత రాష్ట్రాలలోని గవర్నర్లు మదపుటేనుగుల్లా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని, చట్టాలను, రాజకీయ సంస్కృతిని తమ కాళ్ల కింద తొక్కివేస్తున్నారని శివసేన ఆరోపించింది. తన అధికారిక పత్రిక సామ్నాలో గురువారం రాసిన సంపాదకీయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ బిజెపియేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను అస్థిరపరచడానికి కేంద్రం గవర్నర్లను వాడుకుంటోందని శివసేన ఆరోపించింది. బిజెపియేతర పాలిత రాష్ట్రాలలో గవర్నర్లు మదపుటేనుగులని, వాటి మావటీలు ఢిల్లీలో కూర్చుంటున్నారని శివసేన వ్యాఖ్యానించింది.
ఈ రాష్ట్రాల గవర్నర్ల ప్రవర్తన వల్ల దేశ సమైక్యత దెబ్బతింటోందని, ఇది నిప్పుతో చెలగాటమాడినట్లేనని సేన అభిప్రాయపడింది. అలా చేయడం వల్ల తమ చేతులను తామే కాల్చుకుంటున్నామని వారు గుర్తుంచుకోవాలని సేన హెచ్చరించింది. దేశ రాజధానిలో కొత్త పార్లమెంట్ సముదాయం నిర్మించినంత మాత్రాన ప్రజాస్వామ్యం పరిఢవిల్లదని అక్కడి పాలకులు తెలుసుకోవాలని, ఫెడరల్ ప్రభుత్వాలు చేస్తున్న ఆర్తనాదాలు కూడా పిట్టించుకోవాలని సేన పేర్కొంది. రాష్ట్రంలో మహిళల భద్రత, శాంతి భద్రతల పరిస్థితిపై మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అయితే ఉత్తర్ ప్రదేశ్ లేక మధ్యప్రదేశ్‌లోని గవర్నర్లు ఆ రాష్ట్ర పరిస్థితిపై ఎందుకు ఆందోళన వ్యక్తం చేయడం లేదని సేన ప్రశ్నించింది.