న్యూఢిల్లీ : గవర్నర్లను పార్టీ కార్యకర్తలుగా బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి , ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఖర్గే ఘాటుగా స్పందించారు. కొందరు గవర్నర్లు నిస్సిగ్గుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుండటం వల్ల భారత దేశ సమాఖ్య నిర్మాణం సమగ్రతకు కళంకం ఏర్పడుతోందన్నారు.
తమిళనాడు రాష్ట్రానికి తమిళగం అనే పదం సరిగ్గా సరిపోతుందని ఆర్‌ఎన్ రవి ఇటీవల వ్యాఖ్యానించడంతో డీఎంకే తదితర పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. శాసన సభ సమావేశాల మొదటి రోజున సంప్రదాయం ప్రకారం ప్రసంగించిన గవర్నర్ తనకు ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగం లోని కొన్ని భాగాలను వదిలిపెట్టారు. దీంతో చివరకు వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఖర్గే ఇచ్చిన ట్వీట్‌లో గవర్నర్లను ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం ద్వారా రాజ్యాంగ పదవి అయిన గవర్నర్ల వ్యవస్థకు కళంకం తెచ్చేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.