Friday, December 20, 2024

చరిత్ర చీకటి పొరల్లో మత మౌఢ్యం

- Advertisement -
- Advertisement -

అజ్ఞానం ముందు వంగి లేచేది మతం. అజ్ఞానం చుట్టూ ప్రదక్షిణలు చేసేది మతం. సంకుచితత్వం, దురహంకారం, రాజకీయాలతో కలగలిపి చరిత్రను మానవ రక్తంతో గడ్డ కట్టించింది మతం. ఏ కాలమైనా మతం సృష్టించింది చీక టే. చీకటికి పర్యాయ పదమే మతం. మత కలహాల విశ్వ రూపాన్ని దర్శింపజేయడమే భీష్మ్ సహాని నవల ‘తమస్’ ఉద్దేశం. ప్రముఖ హిందీ నవలా రచయిత నవలకు అదే పేరుతో గోవింద్ నిహలానీ రూపొందించిందే ‘తమస్’ చలన చిత్రం. “చీకటి రోజుల్లో కళలూ, కవిత్వాలు వుంటాయా?” అన్ని ప్రశ్నించాడు జర్మన్ మహాకవి బెర్తోల్డ్ బ్రెహ్ట్. “ఉంటాయి! అయితే అవి చీకటి రోజుల గురించి మాత్రమే వుంటాయి” అని ఆయన సమాధానం కూడా చెప్పాడు. “గత చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోనివారు. అవే తప్పిదాల్ని మళ్ళీ మళ్ళీ చేయక మానరు” అని ప్రత్యక్షంగా అనుభవించి చెప్పాడు హిందీ చలన చిత్ర దర్శకుడు గోవింద్ నిహలానీ.

గతంలోనే కాదు, మత కలహాల చీకటి వర్తమానంలో కూడా దేశమంతా వ్యాపించే వుంది. ఇది నడుస్తున్న చరిత్రకు వ్యాఖ్యానం!
1947 ఆగస్టు దేశ విభజనకు ముందు జలాలాబాద్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా భీష్మ్ సహాని (హిందీ నటుడు బలరాజ్ సహాని తమ్ముడు) నవల రూపుదిద్దుకుంది. అటు సింధ్ ఇటు పంజాబ్‌ల మధ్య, అటు ముస్లింలు ఇటు హిందువుల మధ్య, అటు ముస్లిం లీగ్ ఇటు కాంగ్రెస్ రాజకీయాల మధ్య ఐదు లక్షల మంది అసువులు కోల్పోయారు. పదిహేను మిలియన్ల మంది గూడు నీడ లేక నిరాశ్రయులై పాకిస్తాన్‌లోకి, భారత దేశంలోకి వలస వెళ్ళారు. తప్పులు ఇరు పక్షాల వారువీ వున్నాయి. కాబట్టి జరిగిన నరమేధం వెనుక లోపించిన మానవ విలువల్ని, అప్పటి హీనమైన సమయాన్ని ‘తమస్’ చలన చిత్రం బేరీజు వేసింది. ఇందులోని సంఘటనలు ఆ కాలానికే పరిమితం కాదు.

అహ్మదాబాద్, భివండి, మొరాదాబాద్, మీరట్, హైదరాబాద్‌లలో అప్పుడప్పుడు జరుగుతూ వచ్చిన హిందూ ముస్లిం కొట్లాటల వల్ల ఈ కథ ఈ కాలానిదే అని సాక్షం పలుకుతుంది. హిందూ రాజ్యం, ఖలిస్తాన్‌ల కోసం జరుగుతున్న తీవ్రవాద రక్తపాతాలు అందుకు వంతు పాడుతున్నాయి. అంతేకాదు కరాచీ వీధులలో మొహజిర్ నాన్ మొహజిర్‌ల మధ్య జరుగుతున్న ఘర్షణలు ప్రస్తుతం కేరళలో హిందుత్వ, వామపక్ష వర్గాల మధ్య జరుగుతున్న హత్యలు ‘తమస్’లో చూసుకోవచ్చు. కొద్దిపాటి తేడాలతో మత రాజకీయాలకు సంబంధించిన ఏ అల్లర్లలోనైనా నష్టపోయేది ప్రజలే! ఈ విశ్వజనీనమైన నిజాన్ని మనకు దర్శింపజేయడానికి దర్శకుడు చేసిన తపస్సే తమస్! మానవ సంబంధాల్ని మరింత మెరుగుపరచడానికి మతాల్ని, నీచ రాజకీయాల్ని దూరంగా తరిమేయడానికి, నిజమైన విశ్వశాంతిని కాంక్షించడానికి తప్పదు, మనం ఎక్కడో ఓ చోట ఈ విధానాల్ని మార్చుకోక తప్పదు అని గోవింద్ నిహలానీ ‘తమస్’లో చెప్పడానికి ప్రయత్నించాడు.

ఆ చిత్రంలోని కథాంశం ఈ విధంగా వుంటుంది. ఎవరో ధనవంతులైన హిందువులు అర్ధరాత్రి నాథూ ఇంటికి వస్తారు. డబ్బులిచ్చి ఒక పందిని చంపమంటారు. తను చంపిన పంది ఉదయానికి మసీదు ముందుకు చేరుతుందని, దానితో పట్టణంలోని హిందూ ముస్లింల మధ్య అపార్థాలు ఎక్కువై తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని నాథూ ఊహించడు. కాంగ్రెస్ వాళ్ళ ‘ప్రభాత్ భేరి’ కార్యక్రమం అర్ధాంతరంగా ముగుస్తుంది. మరో పక్క ‘అల్లాహో అక్బర్’ నినాదాన్ని తొక్కేయడానికి ‘హరహర మహాదేవ’ బృందం బయలుదేరుతుంది. కత్తులు, కర్రలు తిప్పగలిగే ఖాకీ నిక్కర్ల యువకులు ‘హిందూ సభ’గా విజృంభిస్తారు. వీరందరి మధ్య నాథూ పాత్ర ఎంతో ఉదాత్తమైంది. మత రాజకీయాల్లో చిక్కుకొని, బలైపోయే లక్షలాది సామాన్యులకు ప్రాతినిధ్యం వహించే పాత్ర. “ఇంతగా కుళ్ళపోయిన ఈ సమాజంలోకి మన కొడుకును ఎందుకు రానివ్వాలి?” అని నాథూ (ఓంపురి) గర్భవతి అయిన భార్యను ప్రశ్నిస్తాడు. “వాడి పుట్టుకను ఆపడానికి మనమెవ్వరం? వాడికి కావల్సిన సమాజం కోసం వాడే సంఘర్షిస్తాడు” అని ఆమె (దీపా సాహి) జవాబు చెపుతుంది. ఇక్కడ కొడుకు పుట్టడానికి భారత స్వాతంత్య్రోద్యమానికి అన్వయిస్తాడు దర్శకుడు.
నవలలో లేని కొన్ని కొత్త విషయాలు కూడా దర్శకుడు చిత్రంలో చేర్చుకున్నాడు.

ఉదాహరణకు స్త్రీలు బావిలో దూకిన సంఘటన! ఒకసారి ముస్లింలతో కొట్లాడి సిక్కులు మరణించారని వార్త తెలుస్తుంది. వారికి సంబంధించిన సిక్కు స్త్రీలందరూ పిల్లలతో సహా ఊరి బావిలోకి దూకుతారు. పంజాబ్‌లోని ఒక గ్రామంలో జరిగిన ఈ ‘ఖుర్ బానీ’ ఘటనని దర్శకుడు అదనంగా చేర్చుకున్నాడు. భీష్మ్ సహాని నవలలో ఈ సంఘటన లేదు. అలాగే ఉత్కంఠభరితంగా సాగే మరికొన్ని సంఘటనలు కూడా చిత్రంలో వున్నాయి. ఒక ముస్లిం మహిళ కాఫిర్లయిన సిక్కు దంపతులకు ఆశ్రయమిస్తుంది. మరోచోట ముస్లిం ఉపాధ్యాయుణ్ణి ఒక సిక్కు మహిళ ‘సజీవ దహనం’ నుండి కాపాడుతుంది. పాకిస్తాన్‌లో స్థిరపడ్డ రబాబీలు ఒకప్పుడు గురునానక్ శిష్యులు. అయినా ఇప్పుడు వారు ముస్లిం ఆచార వ్యవహారాలు, నియమాలు కూడా పాటిస్తారు.

సామాన్యుల్లో సుహృద్భావం జాతీయ సమైక్యతను ఆకాంక్షించే గుణం నిండుగా వుంది. దాన్ని వెలికి తీసి చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అతనిలోని మార్కిస్టు దృక్పథం ఇందులో కళాత్మకంగా బయటపడింది. చలన చిత్ర దర్శకుడు గోవిండ్ నిహలానీ బాల్యం కరాచీలో గడిచింది. ‘డాన్’ వార్తా పత్రిక కార్యాలయం ఎదురుగా మేడ మీద వీరి కుటుంబం వుండేది. వారి ఇంటి కింద ఒక పాన్ షాపు వుండేది. పాన్ షాప్ యజమాని ఆందోళనకారులకు భయపడి, పైకి నిహలానీ వాళ్ళింటికి వచ్చాడు. ఆ రోజు సంపాదించిన మొత్తం నిహలానీ తండ్రికి అప్పగించాడు. దాచిపెట్టమని చెప్పి, తప్పించుకొని పారిపోదామని కిందికి వెళ్ళాడు. అంతే ఆందోళనకారులు అతణ్ణి కాల్చేశారు. ఇదంతా బాలుడిగా నిహలానీ ప్రత్యక్షంగా చూశాడు. మత కల్లోల భయంకర స్వరూపం ఆనాడే ఆ పసి హృదయం మీద చెరగని ముద్రవ వేసింది. ఆ అనుభవం అతణ్ణి ఊర్కోనివ్వలేదు. చిత్ర సీమలో ప్రవేశించిన తర్వాత, మత కల్లోలంపై సినిమా తీయాలన్న కోరిక బలపడింది. ఫలితంగానే ‘తమస్’ (చీకటి) పేరుతో సమాజంలో వెలుగులు ప్రసరించాయి.

దర్శకుడు గౌతమ్ ఘోష్ తీసిన బెంగాలి చలన చిత్రం ‘అంతర్జలి యాత్ర’ కంచి శంకరాచార్యకు ఓ సవాల్ విసిరింది. కొన్నేళ్ళ క్రితం ‘సతి’పై వాదోపవాదలు చెలరేగాయి. జాతీయ స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. అందుకు కారణం పూరి శంకరాచార్యులు, కంచి శంకరాచార్యులూ కలిసికట్టుగా ‘సతి’ని బాహాటంగా బలపరచడమే! ఖాంద్వా జిల్లాలోని ఓంకారేశ్వర్‌లో బయటపడ్డ రెండు వేల యేళ్ళ కిందటి ఒక గుహను ప్రారంభిస్తూ స్వామి జయేంద్ర సరస్వతి ‘సతి’ని ప్రోత్సహిస్తూ మాట్లాడాడు. హిందూ మత పునరుద్ధరణలో ‘సతి’ కూడా భాగమేనన్నాడు. కొన్ని వేల యేళ్ళ కిందట గుహను వెలుగులోకి తెచ్చినట్టే అడుగున పడిపోయిన ఆనాటి మూఢాచారాల్ని కూడా వెలుగులోకి తేవాలని ఆయన గారి ఉబలాటం కాబోలు! విశేషమేమంటే వారి పత్రికా విలేకరుల గోష్టిలో మహారాష్ట్ర పౌర సంబంధ, ఆర్థిక శాఖ ఉప మంత్రి, నాగపూర్ విశ్వవిద్యాలయ ఉప కులపతి వున్నారు. ఇలాంటి సంఘటనల్లో అలాంటి వారి గూర్చి విన్నప్పుడు మనకు ‘చదువుకున్న మూర్ఖులు’ అనే పదం గుర్తుకొస్తుంది. ‘స్త్రీ అత్యాచార్ విరోధి సమితి’ పూనుకొని శంకరాచార్య ప్రకటనను నిరసించడంతో విషయాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి. మానవ పురోగమనానికి అడ్డుపడే అలాంటి దద్దమ్మలంతా పెద్దలై కూర్చోబట్టే దేశమింకా ఈసురోమంటోంది.

ఎవడి మతం వాడు, ఎవడి డబ్బా వాడు వాయించుకోకపోతే మానవాళి సమస్యను హేతువాద దృక్పథంతో పరిశీలించొచ్చు కదా? భార్య చనిపోతే, ‘పతి’ ఆమె శవంతో పాటు చితి మీద పడి సజీవంగా కాలి చావాలన్న నియమం వుంటే మరి ఈ స్వాములు ఏం మాట్లాడేవారూ? “పతి”ని బలపరిచేవారా? ఇటు ఇంట్లో స్త్రీలను, అటు బయట ఇతర కులాల వారిని తమ చెప్పుచేతల్లో వుంచుకోవడానికి అగ్రవర్ణం వారు ఏర్పరిచిన నియమాలు, నిబంధనలు ఎంతటి హాస్యాస్పదమైనవో, ఎంత నికృష్టమైనవో ‘అంతర్జలి యాత్ర’ చలన చిత్రం స్పష్టం చేసింది. బెంగాలి రచయిత కమల్ కుమార్ మజుందార్ కథకు రూపకల్పనే ఈ సినిమా! కథాంశం ఈ విధంగా వుంటుంది వృద్ధ బ్రాహ్మణుడు సీతారం అవసాన కాలం దగ్గరి కొస్తుంది. జాతకాలు చెప్పే బ్రాహ్మడు పరిగెత్తుకొస్తాడు. “వృద్ధ బ్రాహ్మణుడు అప్పుడప్పుడే చనిపోడని, మళ్ళీ పెళ్ళి చేస్తే భార్యతో పాటే జంటగా పరలోకాలకు చేరుకుంటాడని” జోస్యం చెపుతాడు. ఇప్పుడో అప్పుడో అన్నట్లున్న వృద్ధ బ్రాహ్మణుణ్ణి అప్పటికే శ్మశానానికి తరలిస్తారు. జ్యోతిష్కుడి మాట మీద, ఉన్న ఫళంగా వృద్ధుడికి శ్మశానంలోనే పద్దెనిమిదేళ్ళ కన్యతో హడావుడిగా వివాహం జరిపిస్తారు. కన్య తండ్రి చాలా పేదవాడు. కూతురికి పెండ్లి చేయలేదనే లోక నింద తప్పించుకోవడానికి పరోక్షంగా కూతురిని చంపడానికే సిద్ధపడ్డాడన్న మాట!

కొన్ని గంటల వ్యవధిలో వృద్ధుడు సీతారాం చనిపోతాడని అందరికీ తెలుసు. అతనితో పాటు అతని భార్య సతీ సహగమనం చేయాల్సి వస్తుందనీ తెలుసు. తెలిసి తెలిసి జోశోబతి అనే అమ్మాయిని ఆమె తండ్రి మరణ శయ్యపై వున్న వృద్ధుడికి కన్యాదానం చేస్తాడు. జోశోబతి బాధ్యతతో భర్తకు సపర్యలు చేస్తూ వుంటుంది. కాటికాపరి బైజు నిమ్న జాతికి చెందిన వాడు. శవాల్ని కాల్చడమే అతని వృత్తి, చదువురాని వాడు. అజ్ఞాని. అయినా సతీ సహగమనం ఎంతటి నీచమైన వ్యవస్థో తెలిసిన వాడు. హృదయమున్నవాడు. జోశోబతి పట్ల సానుభూతితో, ఆమెను ఆ విష వలయం నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమెను సజీవంగా కాల్చడానికి అతనికి మనసొప్పదు… అందుకే పారిపొమ్మని ప్రాధేయపడతాడు. జోశోపతి, బైజుపై నమ్మకం పెంచుకుంటుంది. ఎటు చూసినా ఎవరూలేని అసహాయ స్థితిలో ఆమె అతని ప్రేమకు పాత్రురాలవుతుంది. వృద్ధుడు సీతారం మరణిస్తాడు.

బైజు మాట విని పారిపోనూ లేక, సమాజాన్ని ఎదిరించి బైజుతో వుండనూ లేక అయోమయ స్థితిలో ‘సతి’ కావడానికే నిశ్చయించుకుంటుంది. భర్త మరణానంతరం వైధవ్యం పొందిన భార్య జీవితం మరణం కన్నా భయంకరమైందని ఆమెకు తెలుసు. దేశంలోని ఒక మూఢాచారాన్ని నిర్భయంగా విమర్శించ గలిగిన ఈ చలన చిత్రం ఉత్తమ బెంగాలి చిత్రంగా జాతీయ బహుమతినందుకుంది. చిత్రానికి సంగీతం సత్యజిత్ రే సమకూరిస్తే, శత్రుఘ్ను సిన్హా, శంపాఘోష్, ఉత్పల్ దత్, మోహన్ అగాషే వంటి కళాకారులు నటించారు. సమసిపోయాయని అనుకుంటున్న ఎన్నో వ్యవస్థలు ఇంకా సమసిపోలేదు. గతాన్ని తవ్వుకుంటూ, సమకాలీనంలోని వెనకబాటుతనంతో పోల్చుకుంటూ, లోపించిన మానవతా విలువల్ని ఎత్తి చూపుకుంటూ, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సరిదిద్దుకుంటూ వుండాలి. మరీ ముఖ్యంగా సమాజాన్ని వెనక్కి నడిపించే ప్రభుత్వాలున్నప్పుడు ప్రజలు మరింత అప్రమత్తతతో వుండాలి!.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News