బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద, ఆయన భార్య సునీత అహుజలు విడిపోతున్నారంటూ.. కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ.. తాను తన పిల్లలతో వేరుగా ఉంటున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు కారణం అయ్యాయి. 1987లో గోవింద, సునితను వివాహం చేసుకున్నారు. వీరికి టీనా, యశోవర్థన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ వార్తలను గోవింద మేనకోడలు ఆర్తి సింగ్ ఖండించారు.
ఆ వార్తలు అన్నీ అవాస్తవాలని ఆమె స్పష్టం చేశారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇవన్నీ ఆధారం లేని ఊహాగానాలు అంటూ పేర్కొన్నారు. ‘నేను ప్రస్తుతం ముంబైలో లేను, ఎవరితో టచ్‌లో లేను.. కానీ, మీకు ఒక విషయం చెప్పాలి. ఇది ఒక తప్పుడు వార్త.. ఇందులో ఎలాంటి నిజం లేదు. వారిద్దరి మధ్య ఉన్న బంధం చాలా బలమైనది. ఇన్ని సంవత్సరాల ప్రేమతో కూడిన వాళ్ల బంధాన్ని ఎలా విడదీస్తారు. అసలు ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వ్యక్తిగత జీవితాల గురించి ఇలాంటి వార్తలు వ్యాప్తి చేయడం ఇప్పటికైనా మానుకుంటే మంచిది. నేను కూడా విడాకులు తీసుకుంటున్నానని వార్తలు వచ్చాయి. ఇలా రావడం మమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది’ అని అన్నారు.